
ఇర్ఫాన్ పఠాన్(ఫైల్‌ఫోటో)
న్యూఢిల్లీ: ఈ ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరూ బరిలో ఉన్నారంటే ప్రత్యర్థి జట్లు వారికోసం కచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా కోహ్లి, రోహిత్‌లు తమ బ్యాట్‌లకు పని చెప్పాడానికి ఏమాత్రం వెనకాడరు. వీరిని సాధ్యమైనంత తొందరగా పెవిలియన్‌కు పంపితే అవతలి జట్లకు పైచేయి సాధించే అవకాశం దక్కుతుంది. కాగా, కోహ్లి, రోహిత్‌లను బోల్తా కొట్టించే ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని అంటున్నాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.
ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్.. త్వరలో శ్రీలంక జరగబోయే లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్)లో ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ మంలోనే న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐతో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్న ఇర్ఫాన్ పఠాన్.. కోహ్లి, రోహిత్‌ల వీక్‌నెస్‌ల కూడా తనకు తెలుసన్నాడు. ‘రోహిత్, కోహ్లిలు క్రికెట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ఇద్దరూ చాలా విధ్వంసకర బ్యాట్స్‌మెన్. వీరికి వీరే సాటి. కానీ ఆ ఇద్దర్నీ బోల్తా కొట్టించే ప్రణాళిక నా వద్ద ఉంది. కోహ్లి ఎక్కువగా ముందుకొచ్చి ఆడటానికి ఇష్టపడతాడు. 4-5 స్టంప్‌లైన్‌పై కోహ్లికి బౌలింగ్ వేస్తా. స్వేర్‌లో ఆడేలా కోహ్లిని ఊరిస్తా. ఇలా చేస్తే ముందుకొచ్చి ఆడే కోహ్లి తొందరగా వికెట్ సమర్పించుకుంటాడు. ఇక రోహిత్ విషయానికొస్తే అతనికి విడ్త్ ఎక్కడా ఇవ్వకూడదు. ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలతో కట్టడి చేయాలి’ అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇక ఎల్‌పీఎల్ రావడంతో పాటు టీ20 లీగ్‌లకు గురించి ఇర్ఫాన్ మాట్లాడాడు. వీటిలో ఎక్కువ దేశవాళీ యువ క్రికెటర్లకే చాన్స్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేయలన్నాడు. ఇక తాను జూనియర్ క్రికెటర్లకు సలహాలు ఇవ్వడమే కాకుండా వారి నుంచి సలహాలు కూడా తీసుకుంటానన్నాడు. సీనియర్ల నుంచి కొన్ని విషయాలను నేర్చుకుంటూనే, జట్ల సమావేశాల్లో వారి సలహాలు తీసుకుంటానన్నాడు. కఠిన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది సీనియర్లు వారి అనుభవంతో చెబుతారన్నాడు. అవి మనం ఎక్కడా నేర్చుకోని అనుభవాలనే విషయం తెలుసుకోవాలన్నాడు. గతంలో తాను కొన్ని పలు కోచింగ్ అసైన్‌మెంట్‌ల్లో భాగమయ్యానని, అదొక మధురమైన అనుభూతి అని ఇర్ఫాన్ తెలిపాడు. ఇప్పుడు ఎల్‌పీఎల్లో ఆడటం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఇర్ఫాన్ పేర్కొన్నాడు.