కేరళ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో 6000 పరుగులు సహా 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సక్సేనా 400 వికెట్ల మార్కును క్రాస్ చేశాడు. సక్సేనా బెంగాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 6000 పరుగుల మార్కును తాకాడు. యూపీతో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ తీయడంతో సక్సేనా 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. సక్సేనా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. రంజీ కెరీర్‌లో అతనికి ఇది 29వ ఐదు వికెట్ల ఘనత. 37 ఏళ్ల సక్సేనా రంజీ చరిత్రలో 400 వికెట్లు తీసిన 13వ బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.
2005లో మధ్యప్రదేశ్‌తో తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను మొదలుపెట్టిన సక్సేనా.. ఆ రాష్ట్రం తరఫున 11 ఏళ్ల వ్యవధిలో 159 వికెట్లు, 4041 పరుగులు స్కోర్ చేశాడు. ఆతర్వాత 2016-17 సీజన్ నుంచి సక్సేనా కేరళ జట్టుకు మారాడు. ప్రస్తుతం సక్సేనా కేరళ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కేఎన్ అనంతపద్మనాభన్ టాప్‌లో ఉన్నాడు. సక్సేనా గత రంజీ సీజన్‌లో దిగ్గజాల సరసన చేరాడు. భారత దేశవాలీ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో) 9000 పరుగులు, 600 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సక్సేనాకు ముందు వినూ మన్కడ్, మదన్‌లాల్, పర్వేజ్ రసూల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ సక్సేనా విజృంభించడంతో (5/56) ఉత్తర్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి 2, సర్వటే, కేఎమ్ ఆసిఫ్, అపరాజిత్ తలో వికెట్ పడగొట్టారు. యూపీ ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు శివమ్ శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (21), సర్వటే (4) క్రీజ్‌లో ఉన్నారు. యూపీ బౌలర్లలో శివమ్ మావి, ఆకిబ్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. యూపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేరళ ఇంకా 80 పరుగులు వెనుకపడి ఉంది.
చదవండి: సెలెక్టర్లకు సవాలు విసిరిన శ్రేయస్ అయ్యర్.. వరుసగా రెండు సెంచరీలు
Comments
Please login to add a commentAdd a comment