రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ గ్రూపు-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ, బెంగాల్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేరళ వెటరన్ స్పిన్నర్ జలజ్ సక్సేనా సంచలన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 వికెట్లతో సక్సేనా చెలరేగాడు. సక్సేనా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న బెంగాల్ బ్యాటర్లు విల్లావిల్లాడారు.
21.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జలజ్ కేవలం 68 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పిన్ మయాజాలం ఫలితంగా బెంగాల్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. కాగా సక్సేనాకు ఇవే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం.
అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో కేరళ బౌలర్‌గా సక్సేనా నిలిచాడు. ఈ జాబితాలో కేరళ గ్రేట్ స్పిన్నర్ అమర్జిత్ సింగ్ ఉన్నారు. 1972-73 రంజీ సీజన్‌లో ఓమ్యాచ్‌లో అమర్జిత్ 49 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే 1973 తర్వాత మళ్లీ ఓ కేరళ బౌలర్ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి.
కాగా సక్సేనా ప్రదర్శన పట్ల కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. అతడొక మాస్టర్ క్లాస్ స్పిన్నర్ అని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేరళ 363 పరుగులకు ఆలౌటైంది. కేరళ బ్యాటర్లలో సచిన్ బేబి(124) అక్షయ్ చంద్రన్(106) సెంచరీలతో రాణించారు. సంజూ మాత్రం కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment