Kerala team
-
37 ఏళ్ల వయస్సులో అద్బుతం.. ఏకంగా 9 వికెట్లు! సంజూ ఫుల్ హ్యాపీ
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ గ్రూపు-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ, బెంగాల్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో కేరళ వెటరన్ స్పిన్నర్ జలజ్ సక్సేనా సంచలన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 వికెట్లతో సక్సేనా చెలరేగాడు. సక్సేనా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న బెంగాల్ బ్యాటర్లు విల్లావిల్లాడారు. 21.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జలజ్ కేవలం 68 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పిన్ మయాజాలం ఫలితంగా బెంగాల్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. కాగా సక్సేనాకు ఇవే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం. అదేవిధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో కేరళ బౌలర్‌గా సక్సేనా నిలిచాడు. ఈ జాబితాలో కేరళ గ్రేట్ స్పిన్నర్ అమర్జిత్ సింగ్ ఉన్నారు. 1972-73 రంజీ సీజన్లో ఓమ్యాచ్లో అమర్జిత్ 49 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అయితే 1973 తర్వాత మళ్లీ ఓ కేరళ బౌలర్ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. కాగా సక్సేనా ప్రదర్శన పట్ల కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. అతడొక మాస్టర్ క్లాస్ స్పిన్నర్ అని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేరళ 363 పరుగులకు ఆలౌటైంది. కేరళ బ్యాటర్లలో సచిన్ బేబి(124) అక్షయ్ చంద్రన్(106) సెంచరీలతో రాణించారు. సంజూ మాత్రం కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. -
ఏపీ స్ఫూర్తితో కేరళలో వ్యవసాయ విస్తరణ
సాక్షి, అమరావతి/కంకిపాడు (పెనమలూరు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేరళలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు టీవీ సుభాష్ వెల్లడించారు. ఇక్కడ నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారని అందువల్లే పండ్లు, ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులు, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతిని సాధిస్తోందని కొనియాడారు. సుభాష్ సారథ్యంలో కేరళ ప్రైస్‌బోర్డు చైర్మన్ డాక్టర్ రాజశేఖరన్ నాయర్, వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ సబీర్ హుస్సేన్, అడిషనల్ డైరెక్టర్ సునీల్‌తో కూడిన కేరళ వ్యవసాయ ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణాజిల్లా కంకిపాడులోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను సందర్శించింది. ల్యాబ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు ఆక్వాఫీడ్ టెస్టింగ్ విధానాలను స్వయంగా పరిశీలించారు. గతంలో రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో 11 ల్యాబ్స్ మాత్రమే ఉండేవని.. సర్టిఫై చేసిన నాణ్యమైన ఉత్పాదకాలను రైతులకు అందించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం నియోజకవర్గస్థాయిలో 167, జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లతో పాటు రీజినల్ స్థాయిలో నాలుగు కోడింగ్ సెంటర్లను ఏర్పాటుచేస్తోందని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు కేరళ బృందానికి వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచడమే కాక.. రైతులకు ఉచితంగా సేవలందిస్తున్నామని చెప్పారు. అనంతరం.. టెస్టింగ్ పరికరాలు, టెస్టింగ్ విధానాన్ని కేరళ బృందం పరిశీలించి ప్రశంసించింది. దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలో ఎక్కడా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటుచేసిన దాఖలాల్లేవని సుభాష్ పేర్కొన్నారు. ఏపీలో ఎఫ్పీఓలు బాగా పనిచేస్తున్నాయి అనంతరం.. అరటి ప్రాసెసింగ్, ఎగుమతుల్లో జాతీయస్థాయి అవార్డుతో పాటు వైఎస్సార్ లైఫ్‌టైం అఛీవ్మెంట్ అవార్డు సాధించిన తోట్లవల్లూరు మండలం చాగంటిపాడులోని శ్రీ విఘ్నేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘం (అరటి ఎఫ్‌పీఓ) కార్యకలాపాలను పరిశీలించారు. సంఘంలోని సభ్యులతో సమావేశమై వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. సంఘ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందించిందని ఉద్యాన శాఖ అడిషనల్ డైరెక్టర్ బాలాజీ నాయక్ కేరళ బృందానికి వివరించారు. రాష్ట్రంలో ఎఫ్పీఓల వ్యవస్థ చాలా బలంగా ఉందని, ఏటా వందల కోట్ల టర్నోవర్ జరుగుతోందన్నారు. 100కు పైగా ఎఫ్పీఓల పరిధిలో 37వేల మంది రైతులున్నారని చెప్పారు. ఎఫ్‌పీఒగా ఏర్పడిన తర్వాత సాగు ఖర్చులు తగ్గి రైతుల ఆదాయం 30 శాతం మేర పెరిగిందని ఎఫ్‌పీఓ డైరెక్టర్ కొల్లి చంద్రమోహన్‌రెడ్డి వివరించారు. నేరుగా ట్రేడర్స్‌కు విక్రయించడం ద్వారా రైతులకు గరిష్ట ధర లభించేలా కృషిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేరళ వ్యవసాయ శాఖ డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కూడా ఎఫ్‌పీఓలున్నాయని.. కానీ, ఇంత బలంగాలేవని చెప్పారు. ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, పనివిధానం గురించి ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు వివరించారు. -
ఆర్బీకేల సేవలు అద్భుతం
సాక్షి, అమరావతి/ఉయ్యూరు/గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల సేవలు అద్భుతమని కేరళ అధికారులు ప్రశంసించారు. ఏపీ తరహాలోనే సమీకృత సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్)ను కేరళలో ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల వారీగా ఏపీ ప్రభుత్వం తెస్తున్న మ్యాగజైన్లతోపాటు వ్యవసాయ, ఉద్యాన పంచాంగాలను ఈ వ్యవసాయ సీజన్ నుంచి తమ రాష్ట్రంలోనూ తెస్తామన్నారు. ఈ మేరకు కేరళ వ్యవసాయ శాఖ సంచాలకులు టీవీ సుభాష్ సారథ్యంలో కేరళ ప్రైస్ బోర్డు చైర్మన్ డాక్టర్ రాజశేఖరన్ నాయర్, వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి సబీర్ హుస్సేన్, అదనపు సంచాలకుడు సునీల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం రాష్ట్రంలో పర్యటించింది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ (ఐసీసీ), ఆర్బీకే చానల్‌ను సందర్శించింది. అనంతరం ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే–2ను సందర్శించి రైతులతో భేటీ అయ్యారు. వ్యవసాయ సలహా మండళ్ల సేవలతో పాటు పొలం బడి, డిజిటల్ బ్యాంకింగ్ సేవల వివరాలను తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం.. ఆర్బీకే సందర్శన తర్వాత కేరళ బృందం విజయవాడలో అధికారులతో సమావేశమైంది. గత మూడేళ్లుగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న తీరు నిజంగా అద్భుతం. టెక్నాలజీని ఇంతలా వినియోగించుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఐసీసీ ద్వారా శాస్త్రవేత్తలతో రైతులకు సాగు సలహాలు ఇప్పించడం, ఆర్బీకేల్లోని కియోస్క్‌లో బుక్ చేసుకోగానే నేరుగా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఇస్తున్న విధానం చాలా బాగుంది. ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తున్న తీరు అద్భుతం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి హ్యాట్సాఫ్. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – టీవీ సుభాష్, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కేరళ -
కొండచరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
తిరుమల: భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో ఇటీవల విరిగిపడిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత వర్సిటీ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది. ల్యాండ్‌స్లైడ్స్ నిపుణులు కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించుకుని సమగ్ర సర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు. అమృత వర్సిటీ స్ట్రాటజిక్ ఇన్షియేటివ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మల వాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్, టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
కేరళకు ఆంధ్ర షాక్
ముంబై: వరుసగా మూడు పరాజయాలు చవిచూశాక... నాకౌట్ అవకాశాలు గల్లంతయ్యాక... సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తేరుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరుమీదున్న కేరళ జట్టును ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. టాస్ నెగ్గిన ఆంధ్ర ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ 20 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులే చేసింది. ఆంధ్ర స్పిన్నర్లు జి.మనీశ్ (2/19), లలిత్ మోహన్ (1/21), షోయబ్ మొహమ్మద్ ఖాన్ (1/12) కేరళ జట్టును కట్టడి చేశారు. రాబిన్ ఉతప్ప (8), మొహమ్మద్ అజహరుద్దీన్ (12), సంజూ సామ్సన్ (7), విష్ణు వినోద్ (4) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో కేరళ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సచిన్ బేబీ (34 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్స్‌లు), జలజ్ సక్సేనా (34 బంతుల్లో 27 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 74 పరుగులు జోడించడంతో కేరళ స్కోరు 100 పరుగులు దాటింది. 113 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీకర్ భరత్ (9), మనీశ్ (5), రికీ భుయ్ (1) వెంటవెంటనే అవుటవ్వడంతో ఆంధ్ర 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అయితే ఓపెనర్ అశ్విన్ హెబర్ (46 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (27 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) నాలుగో వికెట్‌కు 48 పరుగులు జత చేసి ఆదుకున్నారు. శ్రీశాంత్ బౌలింగ్‌లో అశ్విన్ అవుటయ్యాక... ప్రశాంత్ కుమార్ (9 నాటౌట్)తో కలిసి రాయుడు ఆంధ్రను విజయతీరాలకు చేర్చాడు. -
68 ఏళ్లలో తొలిసారి...
వాయనాడ్: దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో కేరళ జట్టు సంచలనం సృష్టించింది. తమ చరిత్రలో తొలిసారి ఈ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ మూడో రోజే ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కేరళ 113 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. 195 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 31.3 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ షా (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేరళ పేసర్లు బాసిల్ థంపి (5/27), సందీప్ వారియర్ (4/30) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. పార్థివ్ పటేల్ (0)ను తొలి బంతికే సచిన్ బేబీ రనౌట్ చేశాడు. 24 పరుగులకే గుజరాత్ తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది. ట్రావన్‌కోర్–కొచ్చిన్ పేరుతో 1951–52 సీజన్లో రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన జట్టు... కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1957–58 సీజన్ నుంచి ఆ పేరుతో ఆడుతోంది. గత ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరడం కేరళ అత్యుత్తమ ప్రదర్శన కాగా, ఈ సారి దానిని మరింతగా మెరుగుపర్చుకుంది. ఇతర రంజీ క్వార్టర్స్ స్కోర్లు నాగపూర్: వసీం జాఫర్ (206) డబుల్ సెంచరీతో ఉత్తరాఖండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సరికి విదర్భ 6 వికెట్లకు 559 పరుగులు చేసింది. ఇప్పటికే 204 పరుగుల ఆధిక్యం లభించగా... మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే విదర్భ సెమీస్ చేరడం దాదాపు ఖాయమే. లక్నో: ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూపీకి 177 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 172 పరుగులు చేసిన యూపీ ఓవరాల్‌గా 349 పరుగులు ముందంజంలో ఉంది. కాబట్టి యూపీ ముందుకెళ్లటం ఇక లాంఛనమే. బెంగళూరు: కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక ఆట ముగిసే సరికి 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. దాంతో చివరి రోజు శుక్రవారం ఆట ఆసక్తికరంగా మారింది. -
ఆంధ్ర గెలుపు
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా కేరళ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 49 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. బోడపాటి సుమంత్ (109 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... కెప్టెన్ హనుమ విహారి (27; 3 ఫోర్లు), డీబీ రవితేజ (44; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ 49.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లలో కరణ్ శర్మ (3/37), బండారు అయ్యప్ప (2/28), రికీ భుయ్ (2/8) ఆకట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
రప్ఫాడించిన రాయుడు
విజయనగరం మున్సిపాలిటీ: ఇరు జట్ల కెప్టెన్లు కష్టించి అర్ధ సెంచరీలతో రాణించినా ... మొదటి విజయం హైదరాబాద్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడిని వరించింది. డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికగా సోమవారం నుంచి ప్రారంభమైన సయ్యద్ ముస్తాక్ అలీ టి–20 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్–కేరళ జట్లు ఇక్కడ తలపడగా హైదరాబాద్ జట్లు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కేరళ జట్టు కెప్టెన్ సచిన్ బేబీ ముందుగా హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరవై ఓవర్ల మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ క్రీడాకారులు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేశారు. జట్టు కెప్టెన్ అంబటి రాయుడు 31 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేయగా.. అక్షత్ రెడ్డి 30 బంతుల్లో 34 పరుగులు, సందీప్ 25 బంతుల్లో 25 పరుగులతో రాణించారు. అనంతరం 168 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన కేరళ జట్టు బ్యాట్స్మన్లను హైదరాబాదీలు కట్టడి చేయటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేయగా.. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టు కెప్టెన్ సచిన్ బేబీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. మిగిలిన జట్టు క్రీడాకారుల్లో వి.విష్ణు 22 పరుగులు, రోహన్ 22 పరుగులతో పర్వాలేదనిపించారు. మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.దేవవర్మ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వాసుదేవరాజు, మైదానం అడ్మినిస్ట్రేటివ్ అధికారి జె.త్రినాథ్‌రెడ్డి పర్యవేక్షించారు. -
క్రికెట్లో సంచలనం: తొమ్మిది మంది డకౌట్!
సాక్షి, గుంటూరు: దేశీయ క్రికెట్లో సంచలనం చోటు చేసుకుంది. తొలి బంతికే ఓ జట్టు విజయం సాధించింది. శుక్రవారం గుంటూరులోని జేకేసీ కాలేజీ మైదానంలో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ వన్డే లీగ్, నాకౌట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది. నాగాలాండ్ జట్టుపై కేరళ టీమ్ మొదటి బంతికే విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 ఓవర్లు ఆడి కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. ఇందులో ఒక పరుగు వెడ్ ద్వారా రావడం విశేషం. ఓపెనర్ మేనక 18 బంతులు ఆడి మరొక పరుగు సాధించింది. తొమ్మిది మంది డకౌటయ్యారు. కేరళ కెప్టెన్ మిన్ను మణి నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టింది. మూడు పరుగుల లక్ష్యంతో తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ టీమ్ తొలి బంతికే ఫోర్ కొట్టి సంచలన విజయం సాధించింది. తమ జట్టు అద్భుత విజయం సాధించడం పట్ల కేరళ కోచ్ సుమన్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. నాగాలాండ్ 40 పరుగుల వరకు చేస్తుందని అనుకున్నామని, కానీ ఊహించని విధంగా రెండు పరుగులకే కుప్పకూలిందన్నారు. ఈ ఘనత కెప్టెన్ మిన్ను, ఇతర క్రీడాకారిణులకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. -
ఓవరాల్ చాంప్ కేరళ
సాక్షి, గుంటూరు: జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కేరళ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. స్థానిక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో కేరళ 159 పాయింట్లు స్కోరు చేసింది. 110 పాయింట్లతో తమిళనాడు రెండో స్థానంలో, 101.500 పాయింట్లతో హరియాణా మూడో స్థానంలో నిలిచాయి. ఒక స్వర్ణం, మూడు రజతాలు గెలిచిన ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు 42.500 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో, ఒక కాంస్య పతకం సాధించిన తెలంగాణ ఐదు పాయింట్లతో 20వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. మహిళల విభాగంలో అను రాఘవన్ (400 మీటర్ల హర్డిల్స్–కేరళ)... పురుషుల విభాగంలో దవీందర్ సింగ్ (జావెలిన్ త్రో–పంజాబ్) ఉత్తమ అథ్లెట్స్‌గా ఎంపికయ్యారు. పోటీల చివరి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అథ్లెట్స్‌కు ఒక్కో పతకం లభించాయి. పురుషుల హ్యామర్ త్రో ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీరజ్ కుమార్ రజత పతకం గెలిచాడు. అతను హ్యామర్‌ను 64.73 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 100 మీటర్ల ఈవెంట్లో తెలంగాణకు చెందిన సీహెచ్ సుధాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అతను 10.72 సెకన్లలో గమ్యానికి చేరుకొని మూడో స్థానాన్ని సంపాదించాడు.