విజయనగరం మున్సిపాలిటీ: ఇరు జట్ల కెప్టెన్లు కష్టించి అర్ధ సెంచరీలతో రాణించినా ... మొదటి విజయం హైదరాబాద్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడిని వరించింది. డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికగా సోమవారం నుంచి ప్రారంభమైన సయ్యద్ ముస్తాక్ అలీ టి–20 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్–కేరళ జట్లు ఇక్కడ తలపడగా హైదరాబాద్ జట్లు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కేరళ జట్టు కెప్టెన్ సచిన్ బేబీ ముందుగా హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఇరవై ఓవర్ల మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ క్రీడాకారులు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేశారు. జట్టు కెప్టెన్ అంబటి రాయుడు 31 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేయగా.. అక్షత్ రెడ్డి 30 బంతుల్లో 34 పరుగులు, సందీప్ 25 బంతుల్లో 25 పరుగులతో రాణించారు. అనంతరం 168 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన కేరళ జట్టు బ్యాట్స్‌మన్‌లను హైదరాబాదీలు కట్టడి చేయటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేయగా.. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
జట్టు కెప్టెన్ సచిన్ బేబీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. మిగిలిన జట్టు క్రీడాకారుల్లో వి.విష్ణు 22 పరుగులు, రోహన్ 22 పరుగులతో పర్వాలేదనిపించారు. మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.దేవవర్మ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వాసుదేవరాజు, మైదానం అడ్మినిస్ట్రేటివ్ అధికారి జె.త్రినాథ్‌రెడ్డి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment