T-20 cricket tournament
-
ఐపీఎల్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామా లేదా అన్న విషయంపై తమకే స్పష్టత లేనందున... ఈ సీజన్ టోర్నీ భవితవ్యంపై ఏమీ చెప్పలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ తెలిపారు. ‘లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అందువల్ల ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే ఐపీఎల్‌పై చర్చిస్తాం. ఒకవేళ ఇప్పుడు వాయిదా వేసి అక్టోబర్–నవంబర్లలో లీగ్‌ను నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు కూడా మా వద్ద సమాధానం లేదు. చర్చించడానికి ఏమీ లేనందున సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్ జరగలేదు’ అని అరుణ్ ధుమాల్ వివరించారు. -
రప్ఫాడించిన రాయుడు
విజయనగరం మున్సిపాలిటీ: ఇరు జట్ల కెప్టెన్లు కష్టించి అర్ధ సెంచరీలతో రాణించినా ... మొదటి విజయం హైదరాబాద్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడిని వరించింది. డెంకాడ మండలం చింతలవలసలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం వేదికగా సోమవారం నుంచి ప్రారంభమైన సయ్యద్ ముస్తాక్ అలీ టి–20 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్–కేరళ జట్లు ఇక్కడ తలపడగా హైదరాబాద్ జట్లు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కేరళ జట్టు కెప్టెన్ సచిన్ బేబీ ముందుగా హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇరవై ఓవర్ల మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ క్రీడాకారులు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేశారు. జట్టు కెప్టెన్ అంబటి రాయుడు 31 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు చేయగా.. అక్షత్ రెడ్డి 30 బంతుల్లో 34 పరుగులు, సందీప్ 25 బంతుల్లో 25 పరుగులతో రాణించారు. అనంతరం 168 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన కేరళ జట్టు బ్యాట్స్మన్లను హైదరాబాదీలు కట్టడి చేయటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేయగా.. 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టు కెప్టెన్ సచిన్ బేబీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. మిగిలిన జట్టు క్రీడాకారుల్లో వి.విష్ణు 22 పరుగులు, రోహన్ 22 పరుగులతో పర్వాలేదనిపించారు. మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.దేవవర్మ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వాసుదేవరాజు, మైదానం అడ్మినిస్ట్రేటివ్ అధికారి జె.త్రినాథ్‌రెడ్డి పర్యవేక్షించారు. -
పాక్ క్రికెటర్ జంషేడ్‌పై నిషేధం
కరాచీ: దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మరో పాకిస్తాన్ క్రికెటర్ నాసిర్ జంషేడ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ఫిక్సింగ్ ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు పాక్ క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. 27 ఏళ్ల జంషేడ్ పాక్ తరఫున రెండు టెస్టులు, 48 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌లు ఆడాడు. జంషేడ్ కోరినందుకే అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్‌కు చెందిన వ్యక్తితో తాము భేటీ అయ్యామని విచారణ సందర్భంగా షర్జీల్, లతీఫ్ వెల్లడించడంతో పాక్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆంధ్రకు మరో ఓటమి
చెన్నై: సయ్యద్ ముస్తాక్ అలీ సౌత్‌జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. కర్ణాటకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులే చేసింది. కెప్టెన్ హనుమ విహారి (39 బంతుల్లో 55; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవితేజ (24 నాటౌట్; 3 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పవన్ దేశ్‌పాండే (51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, బండారు అయ్యప్ప, స్వరూప్ రెండేసి వికెట్లు తీశారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆంధ్ర ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడి, ఒక విజయం సాధించి నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు కేరళతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు పరుగుల తేడాతో నెగ్గి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. -
ఆసియా కప్‌కు షమీ దూరం
టి20 ప్రపంచకప్‌కూ డౌటే! న్యూఢిల్లీ: తొడ కండరాల గాయంతో సతమతమవుతున్న భారత పేసర్ మొహమ్మద్ షమీ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతను ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో ఆడేది కూడా అనుమానంగానే ఉంది. సెలక్షన్ కమిటీ ఇతని స్థానంలో సీమర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేసింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం గాయంతో సుదీర్ఘ కాలం జట్టుకు దూరమైన అతన్ని ఆసియా కప్‌లో తలపడే భారత జట్టుకు ఎంపిక చేశారు. అయితే షమీ ఫిట్‌గా లేడని బీసీసీఐ మెడికల్ టీమ్ ధ్రువీకరించింది. యూఏఈ శుభారంభం మరోవైపు ఢాకాలో శుక్రవారం మొదలైన ఆసియా కప్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) శుభారంభం చేసింది. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ 16 పరుగులతో గెలిచింది. తొలుత యూఏఈ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేయగా... అఫ్ఘానిస్తాన్ 19.5 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో ఒమన్ 5 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై గెలిచింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ ఏడు వికెట్లకు 175 పరుగులు చేసి ఓడింది. హాంకాంగ్ బ్యాట్స్‌మన్ బాబర్ హయాత్ (60 బంతుల్లో 122; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. యూఏఈ, అఫ్ఘానిస్తాన్, ఒమన్, హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఈనెల 24న మొదలయ్యే ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది. -
నాకౌట్‌కు విదర్భ, గుజరాత్
* జార్ఖండ్, యూపీ, ముంబై కూడా... * ముస్తాక్ అలీ టి20 టోర్నీ నాగ్‌పూర్: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో గ్రూప్-ఎ నుంచి విదర్భ, గుజరాత్‌లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన విదర్భ 20 పాయింట్లతో గ్రూప్‌లో టాప్‌గా నిలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో హరియాణాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హరియాణా 20 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. మొహిత్ హుడా (24) టాప్ స్కోరర్. తర్వాత గుజరాత్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (20 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ దహియా (15 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగారు. గ్రూప్-డిలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన ఉత్తరప్రదేశ్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై మాత్రం మూడు విజయాలతో 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుని నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మహారాష్ట్ర కూడా 12 పాయింట్లే సాధించినా.. మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ముంబై ముందుకు వెళ్లింది. గ్రూప్-బిలో కేరళతో పాటు జార్ఖండ్ నాకౌట్ పోరుకు చేరుకుంది. ఆంధ్రకు తప్పని ఓటమి గ్రూప్-సిలో ఆంధ్ర జట్టు ఓటమితో లీగ్ దశను ముగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో గోవా 9 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 90 పరుగులు చేసింది. సిర్లా శ్రీనివాస్ (28 నాటౌట్), ప్రదీప్ (20), అజయ్ కుమార్ (19) ఓ మోస్తరుగా ఆడారు. తర్వాత గోవా 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు సాధించింది. శాగూన్ కామత్ (61 నాటౌట్), కౌతాంకర్ (34) రాణించారు. మరోవైపు గ్రూప్-ఎలో హైదరాబాద్ జట్టు నిరాశజనక ప్రదర్శనను కొనసాగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ తమిళనాడు చేతిలో 4 వికెట్లతో ఓడింది. దీంతో లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో నెగ్గిన హైదరాబాద్ 8 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా జాబితాలో ఐదో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.