నాకౌట్‌కు విదర్భ, గుజరాత్
* జార్ఖండ్, యూపీ, ముంబై కూడా...
* ముస్తాక్ అలీ టి20 టోర్నీ
నాగ్‌పూర్: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో గ్రూప్-ఎ నుంచి విదర్భ, గుజరాత్‌లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన విదర్భ 20 పాయింట్లతో గ్రూప్‌లో టాప్‌గా నిలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో హరియాణాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హరియాణా 20 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. మొహిత్ హుడా (24) టాప్ స్కోరర్. తర్వాత గుజరాత్ 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (20 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ దహియా (15 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగారు.
గ్రూప్-డిలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన ఉత్తరప్రదేశ్ 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై మాత్రం మూడు విజయాలతో 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుని నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మహారాష్ట్ర కూడా 12 పాయింట్లే సాధించినా.. మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ముంబై ముందుకు వెళ్లింది. గ్రూప్-బిలో కేరళతో పాటు జార్ఖండ్ నాకౌట్ పోరుకు చేరుకుంది.
ఆంధ్రకు తప్పని ఓటమి
గ్రూప్-సిలో ఆంధ్ర జట్టు ఓటమితో లీగ్ దశను ముగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో గోవా 9 వికెట్ల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 90 పరుగులు చేసింది. సిర్లా శ్రీనివాస్ (28 నాటౌట్), ప్రదీప్ (20), అజయ్ కుమార్ (19) ఓ మోస్తరుగా ఆడారు. తర్వాత గోవా 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు సాధించింది. శాగూన్ కామత్ (61 నాటౌట్), కౌతాంకర్ (34) రాణించారు.
మరోవైపు గ్రూప్-ఎలో హైదరాబాద్ జట్టు నిరాశజనక ప్రదర్శనను కొనసాగించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ తమిళనాడు చేతిలో 4 వికెట్లతో ఓడింది. దీంతో లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో నెగ్గిన హైదరాబాద్ 8 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఓవరాల్‌గా జాబితాలో ఐదో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.