
వాయనాడ్: దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో కేరళ జట్టు సంచలనం సృష్టించింది. తమ చరిత్రలో తొలిసారి ఈ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ మూడో రోజే ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కేరళ 113 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. 195 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 31.3 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. రాహుల్ షా (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేరళ పేసర్లు బాసిల్ థంపి (5/27), సందీప్ వారియర్ (4/30) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. పార్థివ్ పటేల్ (0)ను తొలి బంతికే సచిన్ బేబీ రనౌట్ చేశాడు. 24 పరుగులకే గుజరాత్ తమ చివరి 6 వికెట్లు కోల్పోయింది. ట్రావన్‌కోర్–కొచ్చిన్ పేరుతో 1951–52 సీజన్‌లో రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన జట్టు... కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1957–58 సీజన్ నుంచి ఆ పేరుతో ఆడుతోంది. గత ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరడం కేరళ అత్యుత్తమ ప్రదర్శన కాగా, ఈ సారి దానిని మరింతగా మెరుగుపర్చుకుంది.
ఇతర రంజీ క్వార్టర్స్ స్కోర్లు
నాగపూర్: వసీం జాఫర్ (206) డబుల్ సెంచరీతో ఉత్తరాఖండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సరికి విదర్భ 6 వికెట్లకు 559 పరుగులు చేసింది. ఇప్పటికే 204 పరుగుల ఆధిక్యం లభించగా... మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే విదర్భ సెమీస్ చేరడం దాదాపు ఖాయమే.
లక్నో: ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూపీకి 177 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 172 పరుగులు చేసిన యూపీ ఓవరాల్‌గా 349 పరుగులు ముందంజంలో ఉంది. కాబట్టి యూపీ ముందుకెళ్లటం ఇక లాంఛనమే.
బెంగళూరు: కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక ఆట ముగిసే సరికి 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. దాంతో చివరి రోజు శుక్రవారం ఆట ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment