టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు బుమ్రాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరిచింది. 2024 ఏడాదిలో బుమ్రా 13 టెస్టులు ఆడి ఏకంగా 71 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒక ఏడాది కాలంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. అంతేకాకుండా గతేడాది అత్యధిక టెస్టు వికెట్లు తీసింది కూడా బుమ్రానే కావడం గమనార్హం.
తద్వారా జో రూట్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)లను వెనక్కినెట్టి మరి బుమ్రా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక అవార్డుకు ఎంపికైన తర్వాత తొలిసారి బుమ్రా స్పందించాడు. ఐసీసీ ప్రతిష్టాత్మకు అవార్డు తనకు వరించడం చాలా సంతోషంగా ఉందని జస్ప్రీత్ తెలిపాడు.
"ఐసీసీ పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. టెస్ట్ క్రికెట్ ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉండే ఫార్మాట్. అటువంటి ఫార్మాట్లో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం నాకు చాలా ప్రత్యేకం.
ఈ అవార్డును నాకు మద్దతుగా నిలిచిన నా సహచరులు, కోచ్‌లు, అభిమానులకు అంకితమివ్వాలనుకుంటున్నారు. వీరిందరి సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈ నూతన ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాను" అని బుమ్రా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తొలి భారత్ ఫాస్ట్ బౌలర్ బుమ్రానే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) ఈ అవార్డు అందుకున్నారు. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఏడాదికి గాను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది.
చదవండి: #Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్న కోహ్లి.. రేపే జట్టులోకి ఎంట్రీ?
Comments
Please login to add a commentAdd a comment