Photo Credit: Hundred Twitter
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీమా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరిసింది. గురువారం రాత్రి బర్మింగ్‌హమ్ ఫోనిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని టేబుల్ టాపర్లుగా నిలవగా, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన బర్మింగ్‌హమ్ మాత్రం విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంది.
అయితే సదరన్ బ్రేవ్ విజయంలో జెమీమా మరోసారి కీలకపాత్ర పోషించింది. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా 18 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జెమీమా తనకు వచ్చిన రెండో చాన్స్‌ను రెండు చేతులా ఒడిసిపట్టింది. మూడు ఫోర్లతో చివర్లో సదరన్ బ్రేవ్ భారీ స్కోరు చేయడంలో సహాయపడింది.
ఒకవేళ జెమీమా ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్లు మయియా బౌచర్ (31 బంతుల్లో 45), లిజెల్లే లీ (28 బంతుల్లో 43) ధాటిగా ఆడారు. వీరిద్దరు ఔటైన తర్వాత జెమీమా (18 బంతుల్లో 28 నాటౌట్) అజేయంగా నిలిచింది.
బర్మింగ్‌హమ్ బౌలర్లలో లారెన్ ఫైలర్, అలానా కింగ్, అలిస్ కాప్సీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బర్మింగ్‌హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డేవినా పెర్రిన్ (43 బంతుల్లో 52) అర్ధసెంచరీ వృథాగా మారగా, టామీ బ్యూమౌంట్ (22) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మొలినెక్స్ రెండు వికెట్లు తీయగా, టిల్లీ కొర్టీన్, సారా గ్లెన్, లారెన్ బెల్‌లు తలా ఒక వికెట్ తీశారు.
Never give #JemimahRodrigues a second chance! 🫣
She powered three boundaries to wrap up the innings on a high for Southern Brave! ⚡#TheHundred 2026 👉 Southern Brave vs Birmingham Phoenix | LIVE NOW pic.twitter.com/KqBGgsVVen— Star Sports (@StarSportsIndia) July 30, 2026


