తనవల్లే ఈ స్ధాయిలో ఉన్నా.. ఆయనకే ఈ సెంచరీ అంకితం: రూట్‌ | Joe Root Dedicates His 33rd Test Ton To Mentor Graham Thorpe | Sakshi
Sakshi News home page

తనవల్లే ఈ స్ధాయిలో ఉన్నా.. ఆయనకే ఈ సెంచరీ అంకితం: రూట్‌

Published Fri, Aug 30 2024 4:08 PM | Last Updated on Fri, Aug 30 2024 6:52 PM

Joe Root Dedicates His 33rd Test Ton To Mentor Graham Thorpe

లార్డ్స్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిసిన సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతులు ఎదుర్కొన్న రూట్‌.. 18 ఫోర్ల‌తో 143 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ త‌ర‌పున‌ అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన అలస్టర్ కుక్ రికార్డును రూట్ సమం చేశాడు. కుక్ 161 మ్యాచ్‌ల్లో 33 సెంచ‌రీలు చేయ‌గా.. రూట్ కేవ‌లం 145 మ్యాచ్‌ల్లోనే ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. 

ఆయనకే సెంచ‌రీ అంకితం...
ఇక  జో రూట్ తన 33వ టెస్ట్ సెంచరీని ఇంగ్లండ్‌ దివంగత మాజీ క్రికెట‌ర్‌ గ్రాహం థోర్ప్‌కు అంకిత‌మిచ్చాడు. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ ఎదుగుద‌లలో కీల‌క పాత్ర పోషించిన మెంటార్ థోర్ప్‌కు నివాళులర్పించాడు. త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్న వెంట‌నే రూట్ ఆకాశం వైపు చూస్తూ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. ఆ క్షణాన ఇంగ్లీష్ ఆట‌గాళ్ల‌తో పాటు ప్రేక్ష‌కులు సైతం భావోద్వేగానికి లోన‌య్యారు.

"నా కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది సీనియ‌ర్ ఆట‌గాళ్లు, కోచ్‌లు, మెంటార్‌లతో క‌లిసి ప‌నిచేశాను. నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా కెరీర్‌ను తీర్చిదిద్దిన వారిలో గ్రాహం థోర్ప్ ఒక‌రు. ఈ క్ష‌ణంలో థోర్ప్‌ను గుర్తు చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది.

ఆయనను చాలా మిస్ అవుతున్నాను. నేను ఎప్ప‌టికి థోర్ప్‌కు రుణ‌ప‌డి ఉంటాను.  నా ఆట, నా కెరీర్ ఎదుగుద‌ల‌లో ఆయనది కీల‌క పాత్ర‌. ఈ స్ధాయిలో నేను ఉన్న అంటే కార‌ణం థోర్ప్ అని  గ‌ర్వంగా చెబుతున్నాను.

బ్యాటింగ్ టెక్నిక్‌, స్పిన్న‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోనేందుకు నాకు చాలా స‌హాయం చేశాడరు. ఈ రోజు నేను స్వీప్ షాట్‌ల‌ను సుల‌భంగా ఆడుతున్న అంటే కార‌ణం ఆయనే. నా సెంచరీని థోర్పీకి అంకిత‌మివ్వాల‌న‌కుంటున్నాను అని తొలి రోజు ఆట అనంతరం రూట్ పేర్కొన్నాడు.

 కాగా థోర్ప్ ఈ నెల ఆరంభంలో అనారోగ్య కార‌ణాల‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. థోర్ప్ 1993-2005 కాలంలో ఇంగ్లండ్ తరపున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడారు. ఈ రెండు ఫార్మాట్లలో ఆయన వరుసగా 6744, 2380 పరుగులు చేశారు. గ్రాహం కెరీర్‌లో 16 టెస్ట్ సెంచరీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో 341 మ్యాచ్‌ల్లో 21937 ప‌రుగులు చేశారు.

గ్రాహం థోర్ప్ రిటైర్మెంట్ త‌ర్వాత ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కొంత కాలం బ్యాటింగ్ కోచ్‌గా కూడా ప‌నిచేశారు. అయితే 2022 యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ (0-4) ఘోర ఓట‌మి చవిచూడ‌టంతో బ్యాటింగ్ కోచ్‌గా థోర్ప్ త‌ప్పుకున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement