
ఐసీసీ టోర్నమెంట్లలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరోసారి అఫ్గానిస్తాన్ చేతిలో పరాభావం ఎదురైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బుధవారం లహోర్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 326 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓ దశలో సునాయసంగా గెలిచేలా కన్పించిన ఇంగ్లీష్ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సింది. దీంతో ఈ మెగా టోర్నీ లీగ్ స్టేజీలోనే ఇంగ్లండ్ ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పరాజయం పాలైంది.
జో రూట్ సూపర్ సెంచరీ..
ఇంగ్లండ్ బ్యాటర్లలో వెటరన్ ఆటగాడు జో రూట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. రూట్ 111 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేశాడు. ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా భావించారు. కానీ 46 ఓవర్‌లో అనూహ్యంగా రూట్ ఔట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా అఫ్గాన్ వైపు మలుపు తిరిగింది. రూట్‌తో పాటు బెన్ డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, జేమీ ఒవెర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో చెలరేగారు. అతడితో పాటు మహ్మద్ నబీ రెండు, , ఫజల్ హక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, గుల్బదిన్ నాయబ్ తలా వికెట్ సాధించారు.
జద్రాన్ రికార్డు సెంచరీ..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ రికార్డు సెంచరీ (177)తో చెలరేగాడు. అతడితో పాటు నబీ(40), షాహిదీ(40), అజ్మతుల్లా ఓమర్జాయ్(41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
కెప్టెన్సీకి జోస్ గుడ్‌బై..!
కాగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పర్వాలేదన్పిస్తున్న బట్లర్.. కెప్టెన్సీలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. అతడు కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు ఐసీసీ టోర్నీల్లో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. వన్డే వరల్డ్‌కప్ 2023, టీ20 ప్రపంచకప్-2024లో లీగ్ దశలో నిష్క్రమించిన ఇంగ్లండ్.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
ఇంగ్లండ్ ఐసీసీ టోర్నీల్లోనూ కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ ఇదే తీరును కనబరుస్తుంది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ చేతిలో వరుసగా రెండు ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్ ఓడిపోవడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కెప్టెన్ బట్లర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బట్లర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. "నేను ఇప్పుడు ఎలాంటి భావోద్వేగ ప్రకటన చేయాలనుకోలేదు. కానీ నా కోసం, కొంతమంది మా అగ్రశ్రేణి ప్లేయర్ల కోసం నేను కొన్ని ఆంశాలను పరిగణలోకి తీసుకోవాలంటూ" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే కెప్టెన్సీకి జోస్ ది బాస్ గుడ్‌బై చెప్పనున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
చదవండి: పాకిస్తాన్ కోచ్‌గా వెళ్లేందుకు నేను సిద్దం: యువరాజ్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment