శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను 0-2 తేడాతో టీమిండియా కోల్పోయింది. టీ20 సిరీస్‌లో సత్తాచాటిన భారత జట్టు.. వన్డేల్లో మాత్రం తేలిపోయింది. తొలి వన్డేను టై ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర ఓటమి చవిచూసింది.
తద్వారా 1997 తర్వాత తొలిసారి శ్రీలంకపై భారత్ వన్డే సిరీస్ ఓడిపోయింది. కాగా ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా విఫలమయ్యారు. వికెట్ల తీయడంలో సిరాజ్, అర్ష్‌దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లు నిరాశపరిచారు.
ఈ మొత్తం సిరీస్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. భారత్‌తో పొలిస్తే శ్రీలంక స్పిన్నర్లు మరింత మెరుగ్గా రాణించారు. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సంచలన పోస్ట్ చేశాడు.
స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ విభాగం శూన్యమని జునైద్ తన అక్కసను వెల్లగక్కాడు. "బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ జీరో. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని జునైద్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా పేస్ గుర్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment