జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం | Jyoti Surekha won two medals | Sakshi

జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం

Nov 10 2023 2:04 AM | Updated on Nov 10 2023 2:04 AM

Jyoti Surekha won two medals - Sakshi

బ్యాంకాక్‌: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండు పతకాలు గెలిచింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్‌ విభాగంలో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ 145–145 (8/9) ‘షూట్‌ ఆఫ్‌’లో భారత్‌కే చెందిన పర్ణీత్‌ కౌర్‌ చేతిలో ఓడిపోయింది.

నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరి స్కోర్లు సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందు ఇద్దరికి ఒక్కో షాట్‌ అవకాశం ఇచ్చారు. జ్యోతి సురేఖ బాణం 8 పాయింట్ల వృత్తంలోకి వెళ్లగా... పంజాబ్‌కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్‌ కౌర్‌ 9 పాయింట్ల షాట్‌తో తొలి అంతర్జాతీయ వ్యక్తిగత స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత బృందం కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో 234–233తో చైనీస్‌ తైపీని ఓడించి పసిడి పతకాన్ని దక్కించుకుంది.

ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 5 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు  కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో అదితి–ప్రియాంశ్‌ జోడీ 156–151తో కనోక్‌నాపుస్‌–నవాయుత్‌ (థాయ్‌లాండ్‌) జంటను ఓడించి స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్‌ వర్మ 147–146తో జూ జేహూన్‌ (దక్షిణ కొరియా)ను ఓడించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement