
టోక్యో: ఒలింపిక్స్ మహిళల డిస్కస్ త్రో ఫైనల్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్ త్రో అథ్లెట్ కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్స్‌లో విఫలమైంది. 12 మంది పాల్గొన్న ఫైనల్‌లో కమల్‌ప్రీత్ కౌర్ ఆరో స్థానంలో నిలిచింది. అమెరికా అథ్లెట్ అల్మన్ వాలరీ అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. జర్మనీ అథ్లెట్ పుడెనెజ్ క్రిస్టిన్ రజతం ఎగరేసుకుపోయింది. ఇక క్యూబా అథ్లెట్ పెరెజ్ యామి మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకుంది.
ఇక అమెరికా అథ్లెట్ అల్మన్ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్లతో అందరికన్నా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. జర్మనీ అథ్లెట్ పుడెనెజ్ క్రిస్టిన్ ఐదో ప్రయత్నంలో 66.86 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలువగా.. ఇక క్యూబా అథ్లెట్ పెరెజ్ యామి తొలి ప్రయత్నంలో సాధించిన 65.72 మీటర్ల ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు సెమీస్‌లో 64 మీటర్లతో రెండో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత అథ్లెట్ కమల్‌ప్రీత్‌కౌర్ ఫైనల్లో మూడో ప్రయత్నంలో 63.70 ప్రదర్శన చేసింది.