
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డును శ్రీలంక సంచలన బ్యాటర్ కమిందు మెండిస్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఈ అవార్డు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్‌కు దక్కింది.
పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పోటీపడగా.. మెజార్టీ మద్దతు శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌కు లభించింది.
Kamindu Mendis and Maia Bouchier have won the ICC Player of the Month awards for March 2024. 🌟 pic.twitter.com/h2QClz51SA
— CricTracker (@Cricketracker) April 8, 2024
మహిళల విషయానికివస్తే.. ఈ విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్‌నర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ పోటీ పడగా.. మైయా బౌచియర్‌ను అవార్డు వరించింది.
మెండిస్ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మైయా బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్‌లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది.