
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కఠోరంగా శ్రమిస్తుంది. ఈ సీజన్ కోసం చాలా రోజుల కిందటే ప్రాక్టీస్ షూరూ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రస్తుతం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్‌లతో బిజీగా ఉంది. నిన్న జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌లోని ఓ రేర్ టాలెంట్ బయటపడింది. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేసి వైవిధ్యాన్ని ప్రదర్శించాడు.
ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి రెండు బంతులను కుడి చేతితో వేసిన కమిందు.. ఆతర్వాత బంతిని ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. కమిందు కుడి చేతితో బౌలింగ్ చేస్తూ అప్పటికే బౌండరీ బాది జోష్ మీదున్న ఇషాన్ కిషన్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికి అభినవ్ మనోహర్ క్రీజ్‌లోకి రాగా.. అతనికి తన ఎడమ చేతి వాటాన్ని రుచి చూపించాడు. కమిందు రెండు చేతులతో బౌలింగ్ చేస్తూ ప్రదర్శించిన వైవిధ్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది.
రేర్ టాలెంట్ అంటూ ఫ్యాన్స్ కమిందును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శ్రీలంక నయా సంచలనం కమిందును ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది.
కాగా, ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఇదిలా ఉంటే, ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంకర బ్యాటర్లను వదిలేసి ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్ లాంటి లోకల్ టాలెంట్‌ను అక్కున చేర్చుకుంది. మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి నాణ్యమైన పేసర్లను కూడా వదిలేసింది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ, గత సీజన్ అత్యధిక వికెట్ల వీరుడు హర్షల్ పటేల్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ కొత్తగా జట్టులోకి చేరారు.
2025 ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..
పాట్ కమిన్స్ (కెప్టెన్), అథర్వ్ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, వియాన్ ముల్దర్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్‌జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్
Comments
Please login to add a commentAdd a comment