బెంగళూరు వేదికగా జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ సారథి కరుణ్ నాయర్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో నాయర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 426 పరుగులు చేశాడు. తాజాగా హుబ్లీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు.
కరుణ్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కొదండ కార్తీక్ (30), కార్తీక్ (29), సుచిత్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టైగర్స్ బౌలర్లలో ఎల్‌ఆర్ కుమార్, మాధవ్ ప్రకాశ్ బజాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరియప్ప, రిషి బొపన్న చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. వారియర్స్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 18.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. శ్రీవత్సవ. సుచిత్. ధనుశ్ గౌడ, మనోజ్ భాంగడే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్, దీపక్ దేవడిగ చెరో వికెట్ దక్కించుకున్నారు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ తాహా (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మనీశ్ పాండే (14), శ్రీజిత్ (13), అనీశ్వర్ గౌతమ్ (11), కరియప్ప (11), ఎల్‌ఆర్ కుమార్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment