‘కివీస్‌ తమ స్థాయిని చూపించింది’ | Kiwis have shown their level | Sakshi
Sakshi News home page

‘కివీస్‌ తమ స్థాయిని చూపించింది’

Published Mon, Oct 9 2023 3:55 AM | Last Updated on Mon, Oct 9 2023 7:26 PM

Kiwis have shown their level - Sakshi

తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన ఘనవిజయం కారణంగా న్యూజిలాండ్‌ గురించి ఇప్పుడు ఇతర టీమ్‌ల దృష్టి కోణం మారి ఉంటుంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను కివీస్‌ దెబ్బకొట్టింది. వేగంగా లక్ష్యం చేరిన ఆ జట్టు గెలుపుతో పాటు మెరుగైన రన్‌రేట్‌ను కూడా సాధించింది. ఇలాంటి పెద్ద టోర్నీల్లో సెమీస్‌ చేరేందుకు రన్‌రేట్‌ కూడా కీలకంగా మారుతుంది. తర్వాతి మ్యాచ్‌లో కివీస్‌కు నెదర్లాండ్స్‌ పోటీనిచ్చే అవకాశం కనిపించడం లేదు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌నూ మెరుగ్గానే ఆరంభించినా ‘డచ్‌’ దానిని నిలబెట్టుకోలేకపోయింది. డి లీడ్‌ అద్భుతంగా ఆడినా ఇలాంటి మ్యాచ్‌లో ఒకరికంటే ఎక్కువ మంది మంచి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కాన్వే, రచిన్‌ అదే చూపించారు. కాన్వే ఐపీఎల్‌లో ఇప్పటికే సత్తా చాటగా, రచిన్‌ కొత్తగా వచ్చాడు. రాహుల్, సచిన్‌ పేర్లను కలిపి పెట్టుకున్న అతను వారిద్దరు గర్వపడేలా ఆడాడు. అతని బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా పోలికలు కనిపిస్తున్నాయి. అతనిలాగే ఇతనూ లెఫ్టార్మ్‌ స్పిన్నరే. ముగ్గురు టాప్‌ ఆటగాళ్లు కలగలిసిన వ్యక్తి అంటే అతని ఆట కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా.

భారతీయ మూలాలు ఉన్న రచిన్‌ ఆట శైలి కూడా సగటు న్యూజిలాండర్‌లా లేదు. చక్కటి టైమింగ్, పదునైన స్ట్రోక్‌లతో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను దెబ్బ కొట్టిన అతని ఆట నాకు బాగా నచ్చింది. విలియమ్సన్‌లాంటి పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగి కూడా న్యూజిలాండ్‌ 9 వికెట్ల ఘనవిజయంతో టోర్నీ తొలి మ్యాచ్‌లోనే తమ స్థాయిని ప్రదర్శించింది. నేటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ కూడా చివరి వరకు పోరాడవచ్చేమో కానీ కివీస్‌కు మరో రెండు పాయింట్లు రాకపోతే ఆశ్చర్యపోవాల్సిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement