జట్టుతో చేరనున్న బుమ్రా
రంజీ సెమీఫైనల్ కోసం వాషింగ్టన్ సుందర్ విడుదల
ధర్మశాల: తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకూ దూరమయ్యాడు. మొదటి నుంచీ అతను ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అందుకే జట్టును ఎంపిక చేసిన సమయంలో ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ అంటూ బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. అతను 90 శాతం వరకు కోలుకున్నా... ఇంకా పూర్తి ఫిట్ కాకపోవడంతో మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో మాత్రమే రాహుల్ బరిలోకి దిగాడు. ‘రాహుల్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు.
అతని పరిస్థితిని బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఈ విషయంలో తదుపరి చికిత్సకు సంబంధించి లండన్‌లో ఉన్న వైద్యులతో వారు సంప్రదిస్తున్నారు’ అని బోర్డు పేర్కొంది. రాంచీ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న ప్రధాన పేసర్ బుమ్రా మార్చి 7 నుంచి జరిగే చివరి టెస్టులో బరిలోకి దిగుతాడని బోర్డు ప్రకటించింది. రాహుల్ గైర్హాజరులో రజత్ పటిదార్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 63 పరుగులే చేసిన పటిదార్‌కు తుది జట్టులో చోటు దక్కేది సందేహమే.
పటిదార్ స్థానంలో కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశముంది. టీమ్‌తో ఉన్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ విడుదల చేసింది. రేపటి నుంచి ముంబైతో జరిగే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు తరఫున అతను బరిలోకి దిగుతాడు. లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న పేసర్ షమీ కోలుకుంటున్నాడని... త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీలో అతని రీహాబిలిటేషన్ మొదలవుతుందని బోర్డు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment