కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 నుంచి సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల చేత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు క్లాసెన్ ప్రకటించాడు. సీజన్ మొత్తానికి తాను దూరంగా ఉండనున్నట్లు క్లాసెన్ వెల్లడించాడు. క్లాసెన్ వైదొలగడం అతని ఫ్రాంచైజీ సెయింట్ లూసియా కింగ్స్‌కు కోలకోలేని ఎదురుదెబ్బ.
సెయింట్ లూసియా క్లాసెన్ స్థానాన్ని న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫర్ట్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెయింట్ లూసియా ఈ ఏడాది జూన్‌లో డ్రాఫ్ట్ కంటే ముందు క్లాసెన్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు (2022 ఎడిషన్‌లో) అతను గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడాడు. క్లాసెన్ రీప్లేస్‌మెంట్ అయిన టిమ్ సీఫర్ట్‌కు కూడా మంచి టీ20 ట్రాక్ రికార్డు ఉంది. సీఫర్ట్ 2020లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
మరోవైపు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్ నుంచి మరో స్టార్ ఆటగాడు కూడా వైదొలిగాడు. గాయం కారణంగా జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ప్రకటించాడు. రజా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండింది. ఆ ఫ్రాంచైజీ రజా స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌కు మరికొంత మంది స్టార్ ఆటగాళ్లు పాక్షికంగా దూరం కానున్నారు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ సీజన్ తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరం కానుండగా.. బార్బడోస్ రాయల్స్ ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ సీజన్ తొలి రెండు మ్యాచ్‌లు మిస్ కానున్నారు.
టిమ్ డేవిడ్ స్థానాన్ని యూస్‌ఏ ఆండ్రియస్ గౌస్.. డేవిడ్ మిల్లర్ స్థానాన్ని దునిత్ వెల్లలగే.. కేశవ్ మహారాజ్ స్థానాన్ని షమారా బ్రూక్స్ భర్తీ చేయనున్నారు. కాగా, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఈ రోజు (ఆగస్ట్ 29) నుంచి ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లు మరుసటి రోజు ఉదయం ప్రారంభమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment