టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. దాదాపు ఆరునెలల తర్వాత మళ్లీ భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొననున్నాడు. ఇందుకోసం ఇప్పటికే చెన్నై వేదికగా టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ దిగ్గజ స్పిన్నర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా హోస్ట్ విమల్ కుమార్ అడిగిన ప్రశ్నలకు అశూ ఇచ్చిన సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన దృష్టిలో.. బెస్ట్ కవర్ డ్రైవ్ షాట్ ఆడేది వీరేనంటూ ఇద్దరు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు అశూ. అదే విధంగా.. పుల్ షాట్ అత్యుత్తమంగా ఆడేది ఇతడేనంటూ ఆస్ట్రేలియా దిగ్గజం పేరును ప్రస్తావించాడు. ఇంతకీ వారెవరంటారా?
కోహ్లి, రోహిత్ కాదు!
కాగా ఆధునిక తరం క్రికెటర్లలో కవర్ డ్రైవ్ షాట్ ఆడటంలో టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ మేటి బ్యాటర్ బాబర్ ఆజం ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే, మాజీ క్రికెటర్లలో డేవిడ్ గోవర్, మార్క్ వా, మైకేల్ వాన్, సౌరవ్ గంగూలీ, మార్కస్ ట్రెస్కోతిక్ కూడా షాట్‌తో ప్రసిద్ధి చెందినవారే. అయితే, అశ్విన్ వీరిలో కోహ్లిని కాదని మార్కస్ ట్రెస్కోతిక్, మైకేల్ వాన్‌లకు ఓటేశాడు.
అతడి కవర్ డ్రైవ్‌లే ఇష్టం.. పుల్ షాట్లు ఆడటంలో అతడు బెస్ట్
‘‘మార్కస్ ట్రెస్కోతిక్ అంటే ఇప్పటి యువతలో చాలా మందికి తెలియకపోవచ్చు. నాకైతే అందరికంటే అతడి కవర్ డ్రైవ్‌లే ఎక్కువగా నచ్చుతాయి. ఇక మైకేల్ వాన్ కూడా.. అద్భుతంగా ఈ షాట్లు ఆడగలడు’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక పుల్ షాట్లు ఆడటంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్‌కు ఎవరూ సాటిరారని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుల్ షాట్లు సూపర్‌గా ఆడతాడన్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పిల్లర్లుగా
ఇలా.. అభిమానులు ఊహించినట్లుగా కోహ్లి, రోహిత్ పేర్లు చెప్పకుండా అశూ.. విదేశీ బ్యాటర్ల పేర్లు చెప్పి ఒకరకంగా వారికి షాకిచ్చాడు. కాగా మార్కస్ ట్రెస్కోతిక్- మైకేల్ వాన్ తమ ఆట తీరుతో.. 2000 నాటి తొలినాళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగానికి రెండు పిల్లర్ల మాదిరి నిలబడ్డారు.
ట్రెస్కోతిక్ ఇంగ్లండ్ తరఫున 76 టెస్టులు ఆడి సగటు 43.79తో 5825 పరుగులు సాధించాడు. ఇందులో 14 శతకాలు ఉన్నాయి. మరోవైపు.. మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ 82 టెస్టుల్లో 5719 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 18 సెంచరీలు ఉన్నాయి.
చివరగా ఇంగ్లండ్‌తో..
టీమిండియా తరఫున అశ్విన్ చివరగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాడు. స్వదేశంలో మార్చిలో ముగిసిన ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగానే అశూ.. టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో టెస్టుల్లో 516, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు ఉన్నాయి. టెస్టుల్లో ఘనమైన రికార్డు ఉన్న ఈ స్పిన్ బౌలింగ్ ఐదు శతకాలు కూడా బాదడం విశేషం.
చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment