Ind vs WI, 2nd Test: Kohli Nears Century, India Scores 288 Runs On Day 1 - Sakshi
Sakshi News home page

WI Vs IND 2nd Test: సెంచరీ దిశగా కోహ్లి.. తొలి రోజు ముగిసిన ఆట; టీమిండియా 288/4

Published Fri, Jul 21 2023 7:04 AM | Last Updated on Fri, Jul 21 2023 8:35 AM

Kohli Running Towards Century India Scores-288 Runs-End-1st Day-2nd Test - Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న కోహ్లి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 84 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కోహ్లి(161 బంతుల్లో 87 బ్యాటింగ్‌), రవీంద్ర జడేజా(84 బంతుల్లో 36 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు ఇప్పటివరకు 106 పరుగులు జోడించారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, షానన్‌ గాబ్రియెల్‌, జోమెల్‌ వారికన్‌, జాసన్‌ హోల్డర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

అదరగొట్టిన ఓపెనింగ్‌ జోడి..
అంతకముందు భారత ఓపెనింగ్‌ జోడీ అదరగొట్టింది. కానీ తొలి సెషన్‌ వరకే ఈ శుభారంభం పరిమితమైంది. సెషన్‌ మారగానే వెస్టిండీస్‌ బౌలింగ్‌ ప్రతాపం మొదలైంది. ‘టాప్‌’ లేపింది. ఇరు జట్లు చెరిసగం ఆధిపత్యాన్ని పంచుకోవడంతో ఈ మ్యాచ్‌ పోటాపోటీగా మొదలైంది. టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ బౌలింగ్‌కే మొగ్గుచూపగా, యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ ఆరంభించారు.

ఉదయం సెషన్‌ అంతా వీళ్లిద్దరు ఆడుతూపాడుతూ పరుగులు సాధించారు. చెత్త బంతుల్ని సిక్సర్లుగా మలిచారు. ఈ క్రమంలో ముందుగా ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ 74 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 21వ ఓవర్లోనే జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే ధాటిగా ఆడుతున్న జైస్వాల్‌ కూడా 49 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 121/0 వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు.

భోజన విరామం తర్వాత 30 నుంచి 40 ఓవర్ల మధ్యలో... కేవలం 8 ఓవర్ల వ్యవధిలో కీలకమైన టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. ముందుగా యశస్వి జైస్వాల్‌ (74 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్‌)కు హోల్డర్‌ చెక్‌ పెట్టగా, రోచ్‌ బౌలింగ్‌లో పేలవమైన షాట్‌కు శుబ్‌మన్‌ గిల్‌ (10; 2 ఫోర్లు) నిష్క్రమించాడు. కోహ్లితో కలిసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్‌ శర్మ (143 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను వారికన్‌ బోల్తా కొట్టించాడు.

అనుభవజ్ఞుడైన రహానే (8) క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 139/0 స్కోరు కాస్తా 182/4గా మారిపోయింది. భారత్‌ 50.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గాయపడిన శార్దుల్‌ ఠాకూర్‌ స్థానంలో అతన్ని తీసుకున్నారు. విండీస్‌ తరఫున కిర్క్‌ మెకెంజి కెరీర్‌ మొదలు పెట్టాడు.

చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement