ఐపీఎల్–2022 సాదాసీదాగా ఆరంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఎలాంటి మెరుపులు, విధ్వంసక బ్యాటింగ్ లేకుండా సాఫీగా సాగిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సాధారణ స్కోరుకే పరిమితం కాగా... కేకేఆర్ ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది. సీనియర్లు ధోని, అజింక్య రహానే తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఒక్కటే చెప్పుకోదగ్గ విశేషం కాగా... కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన జడేజా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో విఫలమయ్యాడు.
ముంబై: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ చేసింది. శనివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎమ్మెస్ ధోని (38 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉమేశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యం...
చెన్నై తరఫున గత సీజన్ ఐపీఎల్‌లో ‘ఆరెంజ్ క్యాప్’ సాధించిన రుతురాజ్ గైక్వాడ్ (0) డకౌట్‌తో ఈ సీజన్ మొదలైంది. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన కాన్వే (3) కూడా విఫలమయ్యాడు. ఈ రెండు వికెట్లు ఉమేశ్ యాదవ్‌కు లభించాయి. మరో ఎండ్‌లో రాబిన్ ఉతప్ప (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లతో జోరు ప్రదర్శించినా... మూడు పరుగుల వ్యవధిలో ఉతప్ప, రాయుడు (15) వెనుదిరిగారు. జాక్సన్ అద్భుత స్టంపింగ్‌తో ఉతప్ప అవుట్ కాగా, లేని పరుగు కోసం ముందుకొచ్చిన రాయుడు పెవిలియన్ చేరాడు.
శివమ్ దూబే (3) కూడా అవుట్ కావడంతో చెన్నై సగం వికెట్లు కోల్పోయింది. దాంతో జడేజా (28 బంతుల్లో 26 నాటౌట్; 1 సిక్స్), ధోని ఇన్నింగ్స్‌ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు మరీ నెమ్మదిగా ఆడటంతో పరుగుల రాక కష్టంగా మారింది. వరుసగా 47 బంతుల పాటు బౌండరీనే రాలేదు! 17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 84/5 మాత్రమే. ఇలాంటి స్థితిలో ధోని దూకుడు కనబర్చడంతో సీఎస్‌కే చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. ఆఖరి 3 ఓవర్లలో చెన్నై 47 పరుగులు రాబట్టింది. ధోని, జడేజా 55 బంతుల్లో 70 పరుగులు జోడించారు.
సమష్టి ప్రదర్శనతో...
ఛేదనలో కోల్‌కతాకు రహానే శుభారంభం అందించాడు. మిల్నే ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను ఆపై చక్కటి షాట్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. వెంకటేశ్ అయ్యర్ (16), నితీశ్ రాణా (21) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 76 పరుగులకు చేరింది. జడేజా చక్కటి క్యాచ్‌తో రహానే ఇన్నింగ్స్ ముగియగా, తర్వాత వచ్చిన స్యామ్ బిల్లింగ్స్ (25) ధాటిగా ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే మరో ఎండ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్) చివరి వరకు నిలబడి మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఆట ముగించాడు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) రాణా (బి) ఉమేశ్ యాదవ్ 0; కాన్వే (సి) శ్రేయస్ అయ్యర్ (బి) ఉమేశ్ యాదవ్ 3; రాబిన్ ఉతప్ప (స్టంప్డ్) షెల్డన్ జాక్సన్ (బి) వరుణ్ 28; అంబటి రాయుడు (రనౌట్) 15; రవీంద్ర జడేజా (నాటౌట్) 26; దూబే (సి) నరైన్ (బి) రసెల్ 3; ధోని (నాటౌట్) 50; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–2, 2–28, 3–49, 4–52, 5–61. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4–0–20–2, శివమ్ మావి 4–0–35–0, వరుణ్ చక్రవర్తి 4–0–23–1, సునీల్ నరైన్ 4–0–15–0, రసెల్ 4–0–38–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) జడేజా (బి) సాన్‌ట్నర్ 44; వెంకటేశ్ అయ్యర్ (సి) ధోని (బి) బ్రేవో 16; రాణా (సి) రాయుడు (బి) బ్రేవో 21; శ్రేయస్ (నాటౌట్) 20; బిల్లింగ్స్ (సి) తుషార్ (బి) బ్రేవో 25; జాక్సన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–43, 2–76, 3–87, 4–123. బౌలింగ్: తుషార్ దేశ్‌పాండే 3–0–23–0, మిల్నే 2.3–0– 19–0, సాన్‌ట్నర్ 4–0–31–1, బ్రేవో 4–0–20–3, దూబే 1–0–11–0, జడేజా 4–0–25–0.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ క్యాపిటల్స్ X ముంబై ఇండియన్స్
వేదిక: ముంబై; మధ్యాహ్నం గం. 3:30 నుంచి
పంజాబ్ కింగ్స్ X బెంగళూరు
వేదిక: ముంబై; రాత్రి గం. 7:30 నుంచి
స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment