ఇంగ్లండ్‌లో వర్షాన్ని, క్రికెట్‌ను విడదీసి చూడలేము. సాఫీగా సాగుతున్న మ్యాచ్ ఫలితాన్ని వాతావరణం శాసించడం చాలా నిరాశకు గురి చేసింది. జరిగిన ఆటలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ టామ్ బాంటన్ ఆకట్టుకున్నాడు. మైదానాల్లో ప్రేక్షకులను అనుమతించేందుకు మరికొన్ని రోజులు పడుతుంది. అదృష్టవశాత్తు క్రికెట్‌లో అందునా టి20 ఫార్మాట్‌ను టెలివిజన్ వీక్షకులకు కనులవిందుగా ఉంటుంది. రాబోయే కొన్ని వారాల్లో క్రికెట్ మ్యాచ్‌లు వరుసగా జరగబోతున్నందున ఓ అభిమానిగా చాలా ఆనంద పడుతున్నాను. వ్యక్తిగతంగా నేను బెన్ స్టోక్స్ ఆటను చూడాలనుకుంటున్నాను. కెరీర్ ఆరంభంలో బౌలర్‌గా జట్టులోకి వచ్చి లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి నేడు టాప్ ఆర్డర్‌కు ఎదిగిపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు అతను పూర్తి విశ్వాసంతో ఆడతాడు. ఇతర జట్లలోని ఆల్‌రౌండర్లతో పోలిస్తే స్టోక్స్ అత్యుత్తమం అని చెప్పవచ్చు. మూడు ఫార్మాట్‌లలోనూ స్టోక్స్ ఆధిపత్యం చలాయించడం అతని గొప్పతనాన్ని చాటి చెబుతోంది.
అలనాటి మేటి ఆల్‌రౌండర్లతో స్టోక్స్‌ను ఇప్పుడే సరిపోల్చడం తగదుగానీ అతను తన ఆట ముగించేలోపు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా నిలిచిపోతాడని నమ్మకంతో ఉన్నాను. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆడిన ఇన్నింగ్స్... ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఒంటిచేత్తో గెలిపించిన ఇన్నింగ్స్ అతని మానసిక దృఢత్వాన్ని సూచిస్తోంది. బౌలర్‌గా అతను వికెట్లు తీసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఫీల్డింగ్‌లోనూ పాదరసంలా కదులుతాడు. జట్టులో అతని పాత్ర ఎలాంటిదో అంకెల ద్వారా నిర్ణయించలేము. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల కొరత ఉన్న దశలో స్టోక్స్ కొత్త ఆశాకిరణం. రాబోయే ఐపీఎల్‌లో స్టోక్స్ ఆటను చూడాలని కుతూహలంతో ఉన్నాను. ఇక ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య నేడు జరిగే రెండో టి20 మ్యాచ్‌లో ఇరు జట్లూ సమతూకంతోనే కనిపిస్తున్నాయి. అయితే బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్‌ది కాస్త పైచేయిగా ఉంది. వరుణ దేవుడు కరుణిస్తే మాత్రం అభిమానులకు ఉత్కంఠభరిత పోరును తిలకించే అవకాశం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment