
భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లార్డ్స్ టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా కసితో ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం గిల్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మాంచెస్టర్ టెస్టు కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేయవలసిన మార్పులను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు.
ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ధానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని భజ్జీ టీమ్ మెనెజ్మెంట్‌ను కోరాడు. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు, రెండో టెస్టులో కుల్దీప్ ఆడుతాడని అంతా భావించారు. కానీ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్.. వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
సుందర్ మెరుగైన ప్రదర్శన చేయడంతో మూడో టెస్టులో కూడా అతడిని కొనసాగించారు. ఇప్పుడు మాంచెస్టర్ వికెట్ కాస్త ఫ్లాట్ ఉండే అవకాశమున్నందన కుల్దీప్‌ను ఆడించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈజాబితాలో భజ్జీ కూడా చేరాడు.
ఇప్పటికైనా అతడిని ఆడించండి..
"బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని నేను సూచించాను. కానీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులోనైనా ఛాన్స్ ఇవ్వండి చెప్పాను. అప్పుడు కూడా అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. మాంచెస్టర్ టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను కచ్చితంగా ఆడించాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు.
దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాటర్లకు కుల్దీప్‌ను ఎటాక్ అంత సులువు కాదు. అతడికి బంతిని రెండు వైపులా టర్న్ చేసే సత్తా ఉంది. కుల్దీప్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే మిస్టరీ బౌలర్. టెస్టు క్రికెట్‌లో కొత్త బంతితో వికెట్ల పడగొట్టే బౌలర్ కాదు, పాత బంతితో కూడా అద్బుతాలు చేసే బౌలర్ జట్టుకు కావాలి.
ఆ సత్తా కుల్దీప్ వద్ద ఉంది. కాబట్టి కుల్దీప్ కోసం భారత జట్టు మెనెజ్‌మెంట్ ఓ బ్యాటర్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. నేను టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే నేరుగా నితీశ్ స్ధానంలో కుల్దీప్‌ను జట్టులోకి తీసుకువస్తాను అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు.