
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు మాంచెస్టర్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. సిరీస్ సమమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు.
ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. అతడు 2006 ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 90.14 సగటుతో 631 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 202గా ఉంటుంది.
ఇప్పుడు మాంచెస్టర్‌లో శుబ్‌మన్ మరో 25 పరుగులు సాధిస్తే.. యూసుఫ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుత సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 101.16 సగటుతో 607 పరుగులు చేశాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్.. అనంతరం బర్మింగ్‌హామ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు. అతడి అత్యధిక స్కోర్ 269గా ఉంది.
ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లు
మహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) - 2006లో 4 మ్యాచ్‌ల్లో 631 పరుగులు
శుభ్‌మన్ గిల్ (భారత్) - 2025లో 3 మ్యాచ్‌ల నుండి 607 పరుగులు
రాహుల్ ద్రవిడ్ (భారత్) - 2002లో 4 మ్యాచ్‌ల నుండి 602 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) - 2018లో 5 మ్యాచ్‌ల నుండి 593 పరుగులు
సునీల్ గవాస్కర్ (భారత్) - 1979లో 4 మ్యాచ్‌ల నుండి 542 పరుగులు
సలీమ్ మాలిక్ (పాకిస్తాన్) - 1992లో 5 మ్యాచ్‌ల నుండి 488 పరుగులు
గిల్‌కు కఠిన పరీక్ష..
కాగా మాంచెస్టర్ టెస్టు రూపంలో గిల్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్ 1-2తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో ఓడిన అనంతరం టీమిండియా రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది.
దీంతో ఇప్పుడు నాలుగో టెస్టు భారత జట్టుకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్ కోల్పోనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గిల్ తన కెప్టెన్సీతో జట్టును ఎలా నడిపిస్తాడో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై