'చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా' | KXIP Pacer Mohammed Shami Gets Emotional Missing About Daughter | Sakshi
Sakshi News home page

చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా : షమీ

Published Sun, Sep 13 2020 3:03 PM | Last Updated on Sat, Sep 19 2020 3:22 PM

KXIP Pacer Mohammed Shami Gets Emotional Missing About Daughter - Sakshi

దుబాయ్‌ : టీమిండియా ఆటగాడు మహ్మద్‌ షమీ తన గారాల పట్టి ఐరాను చాలా మిస్సవుతన్నా అంటూ ఎమోషనల్‌గా పేర్కొన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో ఆడేందుకు ప్రస్తుతం షమీ దుబాయ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మహ్మద్‌ షమీ ప్రస్తుతం కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. శనివారం ప్రాక్టీస్‌ అనంతరం పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో షమీ తన కూతురు ఐరాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : వచ్చీ రాగానే.. 'క్లీన్‌ బౌల్ట్'‌)

షమీ మాట్లాడుతూ.. ' చిట్టితల్లి చాలా మిస్సవుతున్నా.. లాక్‌డౌన్‌ సమయం నుంచే నా కూతురును ఒక్కసారి కూడా చూడలేకపోయా.. నా కళ్ల ముందే ఎదుగుతున్న ఐరాను ఒకసారి చూడాలనిపిస్తుంది. ఐపీఎల్‌ ఆడేందుకు దుబాయ్‌కు రావడంతో మరో రెండునెలల పాటు ఐరాను చూసే అవకాశం లేదు. నా భార్య హసీన్‌ జహాన్‌ కూతురుతో వేరుగా ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువగా ఇంట్లోనే గడిపాను.. రోజు ప్రాక్టీస్‌ చేసిన తర్వాత వీలైనప్పుడల్లా ఐరాతో ఫోన్‌లో మాట్లాడేవాడిని.

ఇక ఐపీఎల్ విషయానికి వస్తే నాలుగు నెలల విరామం తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌ చేయడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది.జట్టులో ఇప్పుడిప్పుడే ఆటగాళ్లంతా మ్యాచ్‌లు ఆడేందుకు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతున్నారు. ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు నాకు పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనేమూడు గంటలపాటు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఈసారి ఐపీఎల్‌లో మా జట్టు కచ్చితంగా కప్‌ కొడుతుంది. అందుకు తగ్గట్టుగా ప్లాన్‌ చేసుకుంటున్నాం. ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. తమ చప్పట్లతో మమ్మల్ని ఎంకరేజ్‌ చేసే అభిమానుల్ని మిస్‌ అవుతున్నాం. కానీ ఈసారి టీవీల ద్వారా వీక్షించే అభిమానులకు మా ఆటతో ఉత్సాహపరుస్తాం' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : ‘ఐపీఎల్‌ 2020 విజేత ఎవరో చెప్పేశాడు’)

ఇక ఐపీఎల్‌ కెరీర్‌లో 51 మ్యాచ్‌లాడి 40 వికెట్లు తీశాడు. కాగా షమీ భార్య హసీన్‌ జహాన్‌ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ సంబంధాలు కలిగి ఉండటంతో పాటు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి వేరుగా జీవిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement