జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–9, 21–15తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు.
నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 2–3తో వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు 10–21, 17–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
గాయత్రి జోడీ నిష్క్రమణ
డబుల్స్ విభాగాల్లో భారత జోడీల కథ ముగిసింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–19, 19–21, 19–21తో మయు మత్సుమోటో–వకానా నాగహార (జపాన్) జంట చేతిలో... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 13–21, 21–19, 13–21తో హ నా బేక్–సో హీ లీ (దక్షిణ కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి.
మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి జోడీ 9–21, 11–21తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ ద్వయం సి వె జెంగ్–యా కియాంగ్ హువాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment