లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా నిన్న (మార్చి 25) ఇండోర్ నైట్స్-గౌహతి అవెంజర్స్, వైజాగ్ టైటాన్స్-పట్నా వారియర్స్ జట్లు తలపడ్డాయి. గౌహతితో జరిగిన మ్యాచ్‌లో ఇండోర్ నైట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. పట్నాపై వైజాగ్ టైటాన్స్ 78 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
తరంగ, యూసఫ్ వీరబాదుడు.. అయినా ప్రయోజనం లేదు..!
ఇండోర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గౌహతి.. ఉపుల్ తరంగ (27 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (23 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆఖర్లో అనురీత్ సింగ్ (22 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండోర్.. ఫిల్ మస్టర్డ్ (45 బంతుల్లో 80; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ శర్మ (50 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది.
స్టువర్ట్ బిన్నీ మరోసారి..
పట్నాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ టైటాన్స్.. సన్నీ సింగ్ (45 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ(29 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పట్నా వారియర్స్.. వైజాగ్ బౌలర్లు తిసార పెరీరా (2/2), ఆశిష్ నునివాల్ (2/18), ఇషాన్ మల్హోత్రా (2/18), భారత్ అవస్తి (1/14) ధాటికి 17.5 ఓవర్లలో 131 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. పట్నా ఇన్నింగ్స్‌లో బిస్లా (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లోనూ బిన్నీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment