Photo Credit: US Open Twitter
యూఎస్ ఓపెన్‌లో చెక్ రిపబ్లిక్ స్టార్ ప్లేయర్, ఆరో సీడ్ లిండా నొస్కోవా పోరాటం క్వార్టర్ ఫైనల్స్‌తోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలో 7–6 (7/1), 4–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో నొస్కోవా ఓటమి చవిచూసింది. ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన నొస్కోవా యూఎస్ ఓపెన్ కూడా గెలిచి రెండో గ్రాండ్‌స్లామ్‌ను అందుకోవాలని చూసింది. కానీ ఆమె కల నెరవేరలేదు.
మ్యాచ్ ఓటమి అనంతరం నొస్కోవా మాట్లాడుతూ.. ‘ఒక మూడు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉంటాను. ఈ మూడు రోజులు పీకలదాకా మందు తాగి జరిగింది ఒక పీడకలలా మరిచిపోవాలనుకుంటున్నా. 21 ఏళ్లు కావడంతో నాకు మందు తాగేందుకు అనుమతి ఉందని నేను అనుకుంటున్నా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

Photo Credit: Twitter
‘న్యూయార్క్ అంటే చాలా ఇష్టం. ఎలాగూ యూఎస్ ఓపెన్‌లో నా ప్రయాణం ముగిసింది కాబట్టి ఇక్కడి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లు చూపించే ప్రేమ, ఆప్యాయతతో రాబోయే కొన్ని గంటల్లోనే ఓటమి బాధను మరిచిపోతాననుకుంటా’ అని వెల్లడించింది.
ఇక వరుసగా ఆరో ఏడాది యూఎస్ ఓపెన్‌లో సబలెంకా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2024, 2025లలో యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సబలెంకా 2023లో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2022, 2021లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించింది. కానీ నొస్కోవాతో పోరులో సబలెంకాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు సబలెంకా 2 గంటల 22 నిమిషాల పోరాటం తర్వాత విజయాన్ని అందుకుంది.

Photo Credit: Twitter
నిర్ణయాత్మక మూడో సెట్‌లో సబలెంకా 2–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన అనుభవం సబలెంకాకు ఉపయోగపడింది. వెనుకంజలో ఉన్నా ఆందోళన చెందకుండా ఆడిన సబలెంకా ఏడో గేమ్‌లో నొస్కావా సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది.
ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. ‘సూపర్ టైబ్రేక్’లో తొలుత పది పాయింట్లు సాధించిన ప్లేయర్ విజేత అవుతారు. సూపర్ టైబ్రేక్ ఆరంభంలో ఇద్దరు 3–3తో సమంగా నిలిచాక... సబలెంకా వరుసగా మూడు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు 10–7తో ‘సూపర్ టైబ్రేక్‌ను సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది.
11 straight wins at Grand Slam level.
Linda Noskova had a summer to remember 👏 pic.twitter.com/OLjo0spg6f— US Open Tennis (@usopen) September 8, 2026
Linda Noskova after her loss with Sabalenka:
"I will do something. I'm going to stay for, like, three more days. I'm going to get drunk and forget about this, I guess (laughter). I'm old enough to do that, thankfully."
BTW, great personality!#tennis #usopen26…— Carlo Galati (@CarloGalati) September 8, 2026
చదవండి: ఆఫ్గన్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!


