Lionel Messi: నిరీక్షణ ముగిసింది.. మెస్సీ సాధించాడు

Lionel Messi Dream Fullfilled  After Argentina Lift FIFA WC 2022 Trophy - Sakshi

అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ నిరీక్షణ ఫలించింది. మారడోనా లిగసీని ఈతరంలో కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ కెరీర్‌లో ఎన్నో టైటిల్స్‌, అవార్డులు కొల్లగొట్టాడు. అయినా కానీ ఫిఫా వరల్డ్‌కప్‌ కొట్టలేదన్న లోటు మాత్రం అలానే ఉండిపోయింది. 2014లో ఫిఫా వరల్డ్‌కప్‌ మెస్సీ చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

అయితే ఈసారి మాత్రం మెస్సీనే వరించింది. ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్‌ అని ప్రకటించిన మెస్సీ టైటిల్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. మారడోనా తర్వాత తనను ఎందుకంత ఆరాధిస్తారనేది మెస్సీ మరోసారి నిరూపించాడు.

ఇక మెస్సీ గెలవడం కోసమే ఈసారి ఫిపా వరల్డ్‌కప్‌ జరిగిందా అన్న అనుమానం రాకమానదు.  సౌదీ అరేబియాతో ఓటమి అర్జెంటీనాను పూర్తిగా మార్చివేసింది. ఆ ఓటమితో కుంగిపోని మెస్సీ అన్నీ తానై జట్టును నడిపించాడు. అక్కడి నుంచి మొదలైన మెస్సీ మాయాజాలం ఫైనల్‌ వరకు అజరామరంగా కొనసాగింది. జట్టు తరపున అత్యధిక గోల్స్‌ కొట్టడమే కాదు అత్యధిక అసిస్ట్‌లు చేసి విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 

ఇక 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన మెస్సీ 17 ఏళ్ల తర్వాత తన ఫిఫా వరల్డ్‌కప్‌ అందుకోవాలన్న కలను నిజం చేసుకున్నాడు. అంతేకాదు డీగో మారడోనా తర్వాత అర్జెంటీనాకు కప్‌ను అందించి మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫలితంగా తన వరల్డ్‌కప్‌ కలతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఇక ఇప్పుడు మెస్సీ ఒక చరిత్ర. ఇన్నాళ్లు అర్జెంటీనా సూపర్‌స్టార్‌గా అభివర్ణించిన మెస్సీని ఇకపై దిగ్గజం అని పిలవాల్సిందే.. కాదు కాదు అలా పిలిపించుకోవడానికి అన్ని అర్హతలు సాధించాడు. ఈ తరానికి మెస్సీనే గోట్‌(GOAT) అని ఒప్పుకోవాల్సిందే. మెస్సీతో రొనాల్డోను పోల్చడం ఇకపై ఆపేస్తారేమో చూడాలి.

ఇక ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం అందుకుంది. నిర్ణీత, అదనపు సమయం ముగిసేలోగా ఇరుజట్లు 3-3తో సమంగా ఉండడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ సేన నాలుగు గోల్స్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ రెండో గోల్స్‌​కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 విజేతగా అర్జెంటీనా అవతరించింది.2014లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన మెస్సీ సేన ఈసారి మాత్రం కప్పును ఒడిసిపట్టుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top