
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఏ క్లబ్‌కు ఆడినా తన జోరును చూపిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి క్లబ్ మ్యాచ్ దాకా గోల్స్ కొడుతూనే ఉన్నాడు. ఇటీవలే పీఎస్‌జీ నుంచి ఇంటర్ మియామి(Inter Miami FC)కి రికార్డు ధరకు వెళ్లిన మెస్సీ క్లబ్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.
లీగ్స్ కప్ ప్లేలో భాగంగా డీఆర్వీ పీఎన్‌కే స్టేడియం వేదికగా శనివారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఇంటర్ మియామి, క్రజ్ అజుల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ అదనపు సమయం(ఆట 94వ నిమిషం)లో లభించిన ఫ్రీకిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఇంటర్ మియామి జట్టు క్రజ్ అజుల్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది.
కాగా మ్యాచ్‌కు 22వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మెస్సీని చూడడానికే వచ్చిన అభిమానులకు ఆట ముగిసే సమయానికి నిరాశే మిగిలింది. మెస్సీ గోల్ చూడకుండానే వెళ్లిపోతామేమోనని ఫీలయ్యారు. కానీ 94వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ గోల్‌గా మలచడంతో స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఒక క్లబ్ తరపున అరేంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు.
అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్‌తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు మెస్సీ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి.
LIONEL ANDRÉS MESSI IS NOT HUMAN. pic.twitter.com/2mBDI41mLy
— Major League Soccer (@MLS) July 22, 2023
చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా