
ఫిబ్రవరి 19న జరుగనున్న డ్రాఫ్ట్‌కు (వేలం) ముందు మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket-2025) ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను (విదేశీ ఆటగాళ్లు) ప్రకటించాయి. ఈ లీగ్‌లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొత్తం 23 మంది విదేశీ స్టార్లను అట్టిపెట్టుకున్నాయి. ఫ్రాంచైజీలు అత్యధికంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి చెరో నలుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ వాషింగ్టన్ ఫ్రీడం అత్యధికంగా 6 మంది విదేశీ స్టార్లను రీటైన్ చేసుకుంది. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆసీస్ ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్, మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర ఉన్నారు.
గత సీజన్ రన్నరప్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ తమ కీలక విదేశీ స్టార్లందరినీ రీటైన్ చేసుకుంది. యూనికార్న్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, ఫిన్ అలెన్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మాథ్యూ షార్ట్ ఉన్నారు.
కేకేఆర్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ విదేశీ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌ను రీటైన్ చేసుకుంది.
తొలి సీజన్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ కీరన్ పోలార్డ్, నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్‌ను అట్టిపెట్టుకుంది.
సియాటిల్ ఓర్కాస్.. సౌతాఫ్రికా స్లార్లు హెన్రిచ్ క్లాసెన్, ర్యాన్ రికెల్టన్‌లను రీటైన్ చేసుకుంది.
టెక్సాస్ సూపర్‌కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్, డెవాన్ కాన్వే, నూర్ అహ్మద్, మార్కస్ స్టోయినిస్‌ను రీటైన్ చేసుకుంది.
అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న స్వదేశీ ఆటగాళ్ల జాబితాలను ఇదివరకే ప్రకటించాయి. కాగా, యూఎస్‌ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్ తొలి సీజన్ (2023) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన రెండో సీజన్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం ఛాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment