Legends League Cricket 2022- Manipal Tigers vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో మ్యాచ్‌లో భిల్వార కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్లో వరుసగా సిక్స్, 0, ఫోర్, ఫోర్ బాది టినో బెస్ట్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ సేన గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించింది. కాగా లక్నో వేదికగా ఆదివారం(సెప్టెంబరు 18) మణిపాల్ టైగర్స్- భిల్వార కింగ్స్ మధ్య జరిగింది.
చెలరేగిన ఫిడెల్!
ఇందులో టాస్ గెలిచిన భిల్వార కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ రవికాంత్ శుక్లా వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఫిడెల్ ఎడ్వర్డ్స్(విండీస్ బౌలర్) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. మణిపాల్ టైగర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
కైఫ్ అర్ధ సెంచరీ! అయినా గానీ!
ఇక నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హర్భజన్ బృందం కష్టాల్లో కూరుకుపోయిన వేళ మహ్మద్ కైఫ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 59 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా మణిపాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు(ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు) చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
యూసఫ్ పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! టినో మెరుపులు
లక్ష్య ఛేదనకు దిగిన భిల్వార కింగ్స్ సైతం ఆదిలోనే ఓపెనర్లు నమన్ ఓజా(6 పరుగులు), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్( 4 పరుగులు) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యూసఫ్ పఠాన్ 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 15, టినో బెస్ట్ 15 పరుగులతో రాణించడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి భిల్వారా కింగ్స్ టార్గెట్‌ను ఛేదించింది.
ఇక మణిపాల్ టైగర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఫిడెల్ ఎడ్వర్డ్(నాలుగు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
చదవండి: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్‌నర్‌తో కలిసి! వైరల్
T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా!
Comments
Please login to add a commentAdd a comment