
వైజాగ్‌లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు రంగం సిద్ధం (PC: LLC X)
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్ అభివృద్ధి కోసం అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణను సైతం దిగ్విజయంగా పూర్తి చేస్తున్న తాము.. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) ఆతిథ్యంలోనూ భాగం కానున్నామని హర్షం వ్యక్తం చేశారు.
దాదాపు వంద మంది క్రికెటర్లు నగరానికి
క్రికెట్ ప్రమోషన్‌లో భాగంగా విశాఖలోని పీఎంపాలెంలో గల డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు ఎల్‌ఎల్‌సీ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం నుంచి సోమవారం వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దాదాపు వంద మంది క్రికెటర్లు టోర్నమెంట్‌లో పాల్గొననున్నారని గోపినాథ్‌రెడ్డి తెలిపారు.
భారత్- ఆస్ట్రేలియా, భారత్- సౌతాఫ్రికా మ్యాచ్‌లు
గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్ స్టార్స్, అర్బన్‌రైజర్స్, హైదరాబాద్ జట్లు ఇక్కడ జరిగే మ్యాచ్‌లలో పాల్గొంటాయని వెల్లడించారు.
అదే విధంగా... ఏసీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 19న ఇండియా – ఆస్ట్రేలియా వన్డే, నవంబర్ 23న ఇండియా – ఆస్ట్రేలియా టీ–20, గతేడాది జూన్ 14న ఇండియా- సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ–20 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించామని ఈ సందర్భంగా గోపినాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ అవకాశాలు పెంచడమే లక్ష్యంగా
‘‘ఇవే గాకుండా వైజాగ్‌లో ఫ్లడ్ లైట్స్‌లో ఏపీఎల్, విజయనగరంలో డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్ జరిపి ఆంధ్ర క్రీడాకారులకు ఐపీఎల్ అవకాశాలను పెంచడం జరిగింది. పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏపీలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ కోసం ఏసీఏ ఆధ్వర్యంలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశాం. క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ అని గోపినాథ్‌రెడ్డి తెలిపారు.
లెజెండ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్..
►డిసెంబరు- 2 సాయంత్రం 7 గంటలకు: ఇండియా క్యాపిటల్స్ – మణిపాల్ టైగర్స్
►డిసెంబరు- 3 మధ్యాహ్నం 3 గంటలకు: గుజరాత్ జైంట్స్–సదరన్ సూపర్‌స్టార్స్
►డిసెంబరు- 4 సాయంత్రం 7 గంటలకుః మణిపాల్ టైగర్స్–అర్బన్ రైజర్స్ హైదరాబాద్.
కాగా మాజీ క్రికెటర్ల సారథ్యంలో సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ నవంబరు 18న మొదలైంది. ఈ టీ20 లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ డిసెంబరు 9న సూరత్‌లో జరుగనుంది.
చదవండి: ఆడేది 3 మ్యాచ్‌లు మాత్రమే.. 17 మంది ఎందుకు? భారత సెలక్టర్లపై ప్రశ్నల వర్షం
Comments
Please login to add a commentAdd a comment