లక్నో: ముంబై లక్ష్యం 178. ఒకదశలో రోహిత్ జట్టు 90/0తో లక్నోపై సునాయాసంగా గెలిచే దశలో ఉంది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లు... చేతిలో 10 వికెట్లున్న ముంబై ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ‘లక్’ లక్నో వెంట ఉండటంతో కీలకమైన వికెట్లు, హిట్టర్ల వైఫల్యంతో ముంబై లక్ష్యానికి దూరమైంది. అయితే రోహిత్ సేనను మళ్లీ డేవిడ్ మెరుపులు గెలుపు వాకిట తీసుకెళ్లాయి.
6 బంతుల్లో 11 పరుగులు ముంబైవైపు మొగ్గితే... ఆఖరి ఓవర్ వేసిన మొహసిన్ వికెట్ తీయకపోయినా 5 పరుగులే ఇచ్చి సూపర్ జెయింట్స్‌ను గెలిపించాడు. దీంతో ముంబై 5 పరుగులతో ఓటమి పాలైంది. మొదట లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ (47 బంతుల్లో 89 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరిపించాడు.
కెప్టెన్ కృనాల్ పాండ్యా (42 బంతుల్లో 49 రిటైర్ట్‌హర్ట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. బెహ్రెన్‌డార్ఫ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. యశ్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.
ఆఖర్లో శివమెత్తిన స్టొయినిస్
లక్నో ఇన్నింగ్స్ బ్యాటింగ్ పవర్‌ప్లే మొదలైతే... ముంబై బౌలర్లు ‘పవర్’ చూపారు. దీంతో టాపార్డర్ బ్యాటర్లు దీపక్ హుడా (5), డికాక్ (15 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ప్రేరక్ మన్కడ్ (0) ఆరంభ ఓవర్లలోనే పెవిలియన్‌లో కూర్చున్నారు. హుడా, ప్రేరక్‌లను బెహ్రెన్‌డార్ఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నోను కృనాల్, స్టొయినిస్ నడిపించారు.
వికెట్లనైతే ఆపారు... పరుగులైతే వచ్చాయి కానీ... వేగం మాత్రం లోపించింది. ఇద్దరు 82 పరుగులు జోడించాక కృనాల్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. పూరన్ జతవగా స్టొయినిస్ ఆఖరి ఓవర్లలో సిక్సర్లతో శివమెత్తాడు. 17 ఓవర్లలో లక్నో స్కోరు 123/3 కాగా... జోర్డాన్ వేసిన 18 ఓవర్లో స్టొయినిస్ 6, 0, 4, 4, 6, 4లతో వీరబాదుడు బాదేశాడు. చివరి మూడు ఓవర్లలోనే 54 పరుగులు చేసింది.
ఇషాన్ ధాటితో...
ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ముంబైకి ధాటైన ఆరంభమిచ్చారు. ఇషాన్ బౌండరీలతో, రోహిత్ భారీ సిక్సర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. పరుగులు చకచకా రావడంతో పవర్ ప్లేలో ముంబై 58/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఓపెనర్ల జోరు తగ్గనేలేదు. ఓవర్‌కు సగటున 9 పైచిలుకు పరుగులతో స్కోరుబోర్డును కదిలించారు. 10వ ఓవర్లో 90 పరుగుల వద్ద రోహిత్ (25 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్స్‌లు)ను రవిబిష్ణోయ్ అవుట్ చేశాడు.
అర్ధసెంచరీ పూర్తయ్యాక ఇషాన్, కాసేపటికే సూర్యకుమార్ (7) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో ముంబై కష్టాల్లో పడింది. తర్వాత వచ్చి న నేహల్ వధేరా (16), విష్ణు వినోద్ (2)లు నిరాశ పరచడంతో ముంబై లక్ష్యానికి దూరమైనట్లు కనిపించింది. అయితే ‘హిట్టర్లు’ టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు), కామెరాన్ గ్రీన్ (4 నాటౌట్) ఉండటంతో ఏమూలనో మిణుకుమిణుకుమన్న ఆశల్ని మొహ సిన్ ఆఖరి ఓవర్ ముంచేసింది.
స్కోరు వివరాలు
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: దీపక్ హుడా (సి) డేవిడ్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 5; డికాక్ (సి) కిషన్ (బి) చావ్లా 16; ప్రేరక్ (సి) కిషన్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 0; కృనాల్ (రిటైర్డ్‌హర్ట్) 49; స్టొయినిస్ (నాటౌట్) 89; పూరన్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–35. బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 4–0–30–2, జోర్డాన్ 4–0–50–0, హృతిక్ 3–0– 20–0, చావ్లా 3–0–26–1, ఆకాశ్ 4–0– 30–0, గ్రీన్ 2–0–16–0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) నవీనుల్ (బి) బిష్ణోయ్ 59; రోహిత్ (సి) హుడా (బి) బిష్ణోయ్ 37; సూర్యకుమార్ (బి) యశ్ 7; వధేరా (సి) సబ్– గౌతమ్ (బి) మొహసిన్ 16; డేవిడ్ (నాటౌట్) 32; విష్ణు వినోద్ (సి) పూరన్ (బి) యశ్ 2; గ్రీన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–90, 2–103, 3–115, 4–131, 5–145. బౌలింగ్: కృనాల్ పాండ్యా 4–0–27–0, మొహసిన్ ఖాన్ 3–0–26–1, నవీనుల్ 4–0–37–0, యశ్ ఠాకూర్ 4–0– 40–2, స్వప్నిల్ 1–0–11–0, రవి బిష్ణోయ్ 4–0–26–2.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ VS ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment