జైపూర్: మైదానంలో మెరుపులు... గ్యాలరీలో ప్రేక్షకుల అరుపులు కరువైన ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మేయర్స్ (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అశ్విన్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), బట్లర్ (41 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. అవేశ్ ఖాన్ 3 వికెట్లు, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్టొయినిస్ 2 వికెట్లు పడగొట్టారు.
మేయర్స్ అర్ధశతకం
మెయిడిన్ ఓవర్‌తో మొదలైన లక్నో ఇన్నింగ్స్‌లో మెరుపులు తక్కువే! కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ ఇద్దరు పవర్ హిట్టర్లు పవర్ ప్లేలో ఉన్నప్పటికీ చేసింది 37 పరుగులే! 8, 9వ ఓవర్లలో ఇద్దరు సిక్స్‌లు, ఫోర్లు బాదడంతో స్కోరు వేగం పుంజుకుంది. కానీ తర్వాత రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లకు పైగానే ఓపెనింగ్ జోడీ ఉన్నా చెప్పుకోదగ్గ స్కోరేం రాలేదు. రాహుల్ (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్)ను హోల్డర్ పెవిలియన్ చేర్చడంతో 82 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది.
ఇది మంచి ఆరంభమే అయినా... సూపర్ జెయింట్స్ మాత్రం దీన్ని భారీస్కోరుగా మలుచుకోలేకపోయింది. మేయర్స్ 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ ఒకే ఓవర్లో దీపక్ హుడా (2), మేయర్స్ వికెట్లను పడేశాడు. స్టొయినిస్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), పూరన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయారు. సందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో స్టొయినిస్ కీపర్ క్యాచ్‌తో నిష్క్రమించగా, పూరన్, యుద్‌వీర్ (1) రనౌటయ్యారు.
శుభారంభం వచ్చినా...
రాజస్తాన్ ఇన్నింగ్స్ కూడా లక్నోలాగే సాగింది. దంచికొట్టే ఓపెనర్లు బట్లర్, యశస్వి జైస్వాల్ 11 ఓవర్లకు పైగా క్రీజులో ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని ఊపేసే మెరుపులేమీ కనిపించలేదు. పవర్ ప్లేలో ఓపెనింగ్ జోడీ 47 పరుగులు చేసింది. పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఇద్దరు చూసుకొని ఆడారు. సగం ఓవర్లు (10) ముగిసేసరికి 73/0 స్కోరు చేసింది. స్టొయినిస్ 12వ ఓవర్లో జైస్వాల్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. కానీ అదే ఓవర్లో అవేశ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 87 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది.
ఇంతదాకా బాగానే ఉన్నా... వరుస ఓవర్లలో కీలకమైన సామ్సన్ (2), బట్లర్ వికెట్లను కోల్పోవడంతో రాజస్తాన్‌కు లక్ష్యం కష్టమైంది. 15వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. 30 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో డాషింగ్ బ్యాటర్ హెట్‌మైర్ (2) భారీషాట్‌కు యత్నించి నిష్క్రమించడంతో ఓటమి ఖాయమైంది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ పడిక్కల్ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు) అడపాదడపా కొట్టిన బౌండరీలు జట్టును గెలిపించలేకపోయాయి.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 39; మేయర్స్ (బి) అశ్విన్ 51; బదోని (బి) బౌల్ట్ 1; దీపక్ హుడా (సి) హెట్‌మైర్ (బి) అశ్విన్ 2; స్టొయినిస్ (సి) సామ్సన్ (బి) సందీప్ 21; పూరన్ (రనౌట్) 29; కృనాల్ పాండ్యా (నాటౌట్) 4; యు«ద్‌వీర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–82, 2–85, 3–99, 4–104, 5–149, 6–153, 7–154. బౌలింగ్: బౌల్ట్ 4–1–16–1, సందీప్ శర్మ 4–0–32–1, అశ్విన్ 4–0–23–2, చహల్ 4–0–41–0, హోల్డర్ 4–0–38–1.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) అవేశ్ (బి) స్టొయినిస్ 44; బట్లర్ (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 40; సంజూ సామ్సన్ (రనౌట్) 2; పడిక్కల్ (సి) పూరన్ (బి) అవేశ్ 26; హెట్‌హైర్ (సి) రాహుల్ (బి) అవేశ్ 2; పరాగ్ (నాటౌట్) 15; ధ్రువ్ జురేల్ (సి) హుడా (బి) అవేశ్ 0; అశ్విన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 144.
వికెట్ల పతనం: 1–87, 2–93, 3–97, 4–104, 5–141, 6–141. బౌలింగ్: నవీనుల్ హఖ్ 4–0–19–0, యు«ద్‌వీర్ 2–0–27–0, అవేశ్ ఖాన్ 4–0–25–3, స్టొయినిస్ 4–0–28–2, రవి బిష్ణోయ్ 4–0–25–0, అమిత్ మిశ్రా 2–0–15–0.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ Vs బెంగళూరు (మ. గం. 3:30 నుంచి)
ఢిల్లీ Vs కోల్‌కతా (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment