PC: IPL Twitter
ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని సీఎస్‌కే అభిమానుల 'చిన్న తలా' సురేశ్ రైనా వెల్లడించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం మేరకు.. ఇటీవలి కాలంలో రైనా.. ధోనిని కలిసినప్పుడు తాను ప్రస్తుతానికి రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయట్లేదని తెలిపాడట. రిటైర్మెంట్‌పై తొందరేం లేదని, ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతానని ధోని రైనాతో చెప్పాడట. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ధోని ఇంకో ఏడాది ఆడతాడని తెలిసి సీఎస్‌కే అభిమానులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. ధోని చెప్పినట్లుగానే చేసి (ఐపీఎల్ 2023 టైటిల్ నెగ్గి), మరో ఏడాది తమతో ఉంటాడని కామెంట్స్ చేస్తూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. ధోని రిటైర్మెంట్‌పై రైనా చెప్పిన ఈ విషయం ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తుంది. ఈ సీజన్‌లో కీలక మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ.. సీఎస్‌కే అభిమానులు అప్పుడే టైటిల్ గెలిచినట్లు ఫీలవుతున్నారు. ధోనిని దేవుడిలా కొలిచే తమిళ తంబిలు, అతనిపై అంతే నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ ఏడాది టైటిల్ తమదేనిని ధీమాగా ఉన్నారు.
కాగా, ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు తదుపరి ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా సునాయాసంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రెండింటిలో ఒక మ్యాచ్ అటుఇటైనా మెరుగైన రన్‌రేట్ (0.409) ఉంది కాబట్టి ప్లే ఆఫ్స్ బెర్తుకు ఢోకా ఉండదు. ఇక్కడ ధోని సేనకు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ జట్టు ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు టేబుల్ లాస్ట్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. మే 10, 20 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మరో మ్యాచ్ కేకేఆర్‌తో మే 16న జరుగనుంది.
మరోవైపు సీఎస్‌కే ప్రస్తుత సీజన్‌లో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనప్పటికీ.. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఫైనల్ ఎలెవెన్‌లోని ప్రతి ఆటగాడు తమలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీస్తున్నారు. ధోని సహా కాన్వే, రుతురాజ్, రహానే, శివమ్ దూబే, జడేజా, మొయిన్ అలీ, దీపక్ చాహర్, పతిరణ, తీక్షణ, తుషార్.. ఇలా జట్టులోప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. ఆ జట్టును అంబటి రాయుడు ఫామ్ లేమి ఒక్కటే కలవరపెడుతుంది.
కాన్వే (458 పరుగులు), రుతురాజ్ (384) లీగ్ టాప్ స్కోరర్ల జాబితాలో 4, 7 స్థానాల్లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో తుషార్ (19) లీగ్ టాప్ వికెట్ టేకర్‌గా, 15 వికెట్లు తీసిన జడేజా టాప్ 8 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. సీఎస్‌కేకు ఇన్ని శుభసూచకాలు కనిపిస్తుండటంతో ఆ జట్టు అభిమానులు సైతం టైటిల్ నెగ్గడంపై ధీమాగా ఉన్నారు.
చదవండి: దేశంలో టెస్ట్‌లకు సూటయ్యే ఆటగాడే లేడనా, ఈ ఆణిముత్యాన్ని ఎంపిక చేశారు..!
Comments
Please login to add a commentAdd a comment