
ముంబై: క్రికెట్ ఫ్యాన్స్‌కు శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగా షాకిచ్చాడు. యూఎఈ వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 సీజన్‌లో మలింగా యార్కర్లను క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించలేరు. ఈ ఐపీఎల్‌లో పాల్గోనడం లేదని లసిత్ మలింగా బుధవారం ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ తరపున లసిత్ మలింగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా లసిత్ మలింగా స్థానంలో ఆసీస్ పేసర్ జేమ్స్ పాటిన్సన్ ఆడనున్నాడు. అయితే ఈ అంశంపై ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ జట్టుకు మలింగా లెజెండ్ అని, ఈ ఐపీఎల్‌లో మలింగ్ ఆడకపోవడం జట్టుకు ఇబ్బందేనని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్యా కొన్ని వ్యక్తిగత సమస్యలతో మలింగా అతని కుటుంబంతో గడపడం అత్యవసరమని పేర్కొన్నాడు.
కాగా మలింగా స్థానంలో జట్టులో ఆడనున్న జేమ్స్ పాటిన్సన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ కుటుంబం వలె మేనేజ్‌మెంట్, జట్టు ఆటగాళ్లంతా సంతోషంగా ఉంటామని ఆకాశ్ అంబానీ పేర్కొన్నాడు. కాగా గత ఐపీఎల్‌లో చెన్నైతో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన మలింగ, మెరుపు బౌలింగ్‌తో కేవలం ఒక పరుగు తేడాతో ముంబయి ఇండియన్స్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు. కాగా ఇప్పటి వరకూ 122 మ్యాచ్‌లాడిన లసిత్ మలింగ 19.80 సగటుతో ఏకంగా 170 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన లసిత్ మలింగ,16 వికెట్లు పడగొట్టి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. (చదవండి: నేను ఎందుకిలా?: లసిత్ మలింగా)