వీళ్ల ఆటను చూడాల్సిందే! | Many giants in Paris Olympics | Sakshi
Sakshi News home page

వీళ్ల ఆటను చూడాల్సిందే!

Published Wed, Jul 24 2024 3:53 AM | Last Updated on Wed, Jul 24 2024 2:00 PM

Many giants in Paris Olympics

పారిస్‌ ఒలింపిక్స్‌లో పలువురు దిగ్గజాలు 

చరిత్ర సృష్టించేందుకు సిద్ధం

జీవితంలో ఒక్కసారి ఒలింపిక్స్‌లో పోటీపడితేనే తమ జీవితాశయం నెరవేరినట్లు చాలా మంది క్రీడాకారులు భావిస్తారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొందరు జాతీయ హీరోలుగా ఎదుగుతారు. ఒలింపిక్స్‌ పేరును ఎప్పుడు ప్రస్తావించినా తమ పేరును కూడా స్మరించుకునే విధంగా చరిత్రకెక్కుతారు. తమ అది్వతీయమైన ప్రదర్శనతో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తారు. 

ఒలింపిక్స్‌లో పోటీపడటాన్ని... పతకాలను సాధించడాన్ని... ప్రపంచ రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. మరో రెండు రోజుల్లో మొదలయ్యే పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో దిగ్గజాలు మరోసారి తమ విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అందులో కొందరి గురించి క్లుప్తంగా...  –సాక్షి క్రీడా విభాగం

సిమోన్‌ బైల్స్‌  (జిమ్నాస్టిక్స్‌) 
మెరుపు తీగలా కదులుతూ... అలవోకగా పతకాలు గెలుస్తూ... ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో తనదైన ముద్ర వేసింది అమెరికాకు చెందిన సిమోన్‌ బైల్స్‌. 27 ఏళ్ల బైల్స్‌ వరుసగా మూడో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. 4 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బైల్స్‌ ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు కైవసం చేసుకుంది. 

‘పారిస్‌’లో బైల్స్‌ మరో పతకం నెగ్గితే ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికన్‌ జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పుతుంది. బైల్స్‌ ఐదు పతకాలు గెలిస్తే... ఒలింపిక్స్‌ చరిత్రలోనే 12 పతకాలతో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌లలో లారిసా లాతినినా (రష్యా; 18 పతకాలు) తర్వాత రెండో స్థానానికి చేరుకుంటుంది. 

మిజైన్‌ లోపెజ్‌ నునెజ్‌ (రెజ్లింగ్‌) 
గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో ఎదురులేని దిగ్గజ రెజ్లర్‌. క్యూబాకు చెందిన 41 ఏళ్ల నునెజ్‌ వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలను సాధించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నునెజ్‌ పురుషుల గ్రీకో రోమన్‌ 130 కేజీల విభాగంలో మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా ఉన్నాడు. 2004 ఏథెన్స్‌లో 120 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన నునెజ్‌ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

2008 బీజింగ్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లలో 120 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో 130 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. పారిస్‌ గేమ్స్‌లోనూ నునెజ్‌ పతకం సాధిస్తే... ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ చరిత్రలో ఐదు స్వర్ణాలు లేదా ఐదు పతకాలు నెగ్గిన ఏకైక రెజ్లర్‌గా ఘనత వహిస్తాడు. 

ఎలూడ్‌ కిప్‌చోగి (అథ్లెటిక్స్‌) 
లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌లో ఆఫ్రికా అథ్లెట్లకు తిరుగులేదు. పారిస్‌ ఒలింపిక్స్‌లో కెన్యాకు చెందిన 39 ఏళ్ల ఎలూడ్‌ కిప్‌చోగి గతంలో మారథాన్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న కిప్‌చోగి 2004 ఏథెన్స్‌ గేమ్స్‌లో 5000 మీటర్లలో కాంస్యం, 2008 బీజింగ్‌ గేమ్స్‌లో 5000 మీటర్లలో రజతం సాధించాడు. 

2012 లండన్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన కిప్‌చోగి ఆ తర్వాత మారథాన్‌ (42.195 కిలోమీటర్లు) వైపు మళ్లాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్‌చోగి విజేతగా నిలిచి రెండు స్వర్ణాలు సాధించాడు. 

ఈ క్రమంలో అబెబె బికిలా (ఇథియోపియా), వాల్దెమర్‌ (జర్మనీ) తర్వాత ఒలింపిక్స్‌ మారథాన్‌ చరిత్రలో రెండు స్వర్ణాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా నిలిచాడు. పారిస్‌లోనూ కిప్‌చోగి పతకం లేదా స్వర్ణం నెగ్గితే ఒలింపిక్స్‌ మారథాన్‌ చరిత్రలో అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు.  

లెబ్రాన్‌ జేమ్స్‌ (బాస్కెట్‌బాల్‌) 
ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ను 1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రీడాంశంలో అమెరికాయే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించిన అమెరికా జట్టు ఇప్పటి వరకు బాస్కెట్‌బాల్‌లో 16 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన అమెరికా ఆ తర్వాత వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించింది. 

మరో స్వర్ణమే లక్ష్యంగా అమెరికా పారిస్‌ గేమ్స్‌లో అడుగు పెడుతుంది. నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌ చరిత్రలో టాప్‌ స్కోరర్‌గా ఉన్న లెబ్రాన్‌ జేమ్స్‌ నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో ఆడుతున్న లెబ్రాన్‌ జేమ్స్‌ తన సహజశైలిలో ఆడితే ఈసారీ అమెరికాకు ఎదురుండదు.  

టెడ్డీ రైనర్‌ (జూడో) 
పురుషుల జూడో క్రీడాంశంలో 12 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్‌ దిగ్గజం టెడ్డీ రైనర్‌ సొంతగడ్డపై రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 35 ఏళ్ల టెడ్డీ రైనర్‌ ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు, 2 కాంస్యాలు సాధించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న టెడ్డీ పారిస్‌ ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌తోపాటు హెవీ వెయిట్‌ విభాగంలో బరిలోకి దిగుతాడు. 

ఈ రెండు విభాగాల్లోనూ టెడ్డీ స్వర్ణాలు సాధిస్తే ఫ్రాన్స్‌ తరఫున ఒలింపిక్స్‌ క్రీడల్లో అత్యధికంగా ఐదు స్వర్ణాలు గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఫ్రాన్స్‌ ఫెన్సర్లు లూసియన్‌ గాడిన్, క్రిస్టియన్‌ డోరియోలా గతంలో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాల చొప్పున సాధించారు.  

బైల్స్, లెబ్రాన్‌ జేమ్స్, కెప్‌చోగి, టెడ్డీ రైనర్, నునెజ్‌లే కాకుండా పోల్‌వాల్టర్‌ డుప్లాంటిస్‌ (స్వీడన్‌), టేబుల్‌ టెన్నిస్‌లో మా లాంగ్‌ (చైనా), స్విమ్మింగ్‌లో సెలెబ్‌ డ్రెసెల్‌ (అమెరికా), కేటీ లెడెకీ (అమెరికా) కూడా పారిస్‌ ఒలింపిక్స్‌లో కొత్త చరిత్రను లిఖించే దారిలో ఉన్నారు.  వారందరికీ ఆల్‌ ద బెస్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement