ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్‌లో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ జట్టు బిగ్ షాకిచ్చింది. శనివారం పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరిగిన కాంస్య పతకపోరులో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది. దీంతో కాంస్య పతకాన్ని బంగ్లా టైగర్స్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది.
6 బంతుల్లో 20 పరుగులు..
ఆఖరి ఓవర్‌లో విజయానికి 20 పరుగులు కావల్సిన నేపథ్యంలో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. ముఖీమ్ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతినే యాసిర్ అలీ సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసిన యాసిర్ అలీ.. మూడో బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. ఈ క్రమలో ఆఖరి మూడు బంతుల్లో బంగ్లాకు 6 పరుగులు అవసరమయ్యాయి.
అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అలీ.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో బంగ్లా డగౌట్‌లో ఒక్కసారిగా నిరాశ నెలకొంది. అయితే ఆరో బంతికి రకీబుల్ హసన్ ఫోర్ బాది బంగ్లాదేశ్‌కు చిర్మసరణీయ విజయాన్ని అందించాడు.
కాగా తొలుత వర్షం కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ 5 ఓవర్లలో 48/1 ఉండగా మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 65 పరుగులుగా నిర్ణయించారు. బంగ్లా బ్యాటర్లలో యాసిర్ అలీ(16 బంతుల్లో 34), అఫిప్ హోస్సేన్(11 బంతుల్లో 20 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment