
రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా (PC: MI)
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లు ఐకమత్యంగా ఉంటే ఆ జట్టును ఎవరూ ఓడించలేరని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గతం తాలుకు చేదు అనుభవాలు, భేషజాలను వదిలేసి ‘స్టార్లంతా’ ఒకటిగా ముందుడుగు వేయాలని సూచించాడు. యాజమాన్యం సైతం ఈ విషయంలో మరింత చొరవ చూపాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు.
కాగా ఐపీఎల్-2024 (IPL)లో ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను అందలమెక్కించింది. తమకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్‌ను చేసింది. దీంతో అభిమానులు సైతం ముంబై ఓడిపోవాలని కోరుకుంటూ.. పాండ్యాను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.
ఇక రోహిత్‌తో పాటు టీమిండియా స్టార్లు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా పాండ్యాకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే మైదానంలో వీరి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగే గెలిచిన ముంబై.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.
విభేదాలు పక్కనపెట్టాలి
అయితే, ఈసారి విభేదాలన్నీ పక్కనపెట్టి ముంబై ఆటగాళ్లు గనుక కలిసికట్టుగా ఉంటే విజయం వారిదేనని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘జట్టు ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్ పనితీరును అంచనా వేస్తారు.
అతడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నపుడు.. జట్టు మొత్తం రాణించింది. టైటిల్ గెలిచింది. అందుకే అతడు మంచి కెప్టెన్ అయ్యాడు. నిజానికి ముంబై జట్టు గతేడాది పటిష్టంగా ఉంది. ట్రోఫీ గెలవాల్సింది కూడా!
బౌలింగ్ విభాగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం బలంగా ఉంది. అయినా దారుణంగా ఓడిపోయింది. కలిసికట్టుగా ఉన్న జట్లే విజయం సాధిస్తాయి. గతం గతః.. ఆటగాళ్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కనపెట్టాలి.
ఈసారి ముంబై జట్టు మిగతా జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వారికి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. సరికొత్తగా ఈ సీజన్‌ను ఆరంభించి సమిష్టిగా రాణిస్తే జట్టుకు ఎదురే ఉండదు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టు- వారి ధర
జస్‌ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు), హార్దిక్ పాండ్యా (కెప్టెన్- రూ.16.35 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) , ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు), నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు), విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు), ఘజన్‌ఫర్ (రూ. 4.80 కోట్లు- గాయం వల్ల దూరం- అతడి స్థానంలో ముజీబ్ ఉర్ రెహమాన్)..
మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), ర్యాన్ రికెల్టన్ (రూ. 1 కోటి), రీస్ టోప్లే (రూ. 75 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) , కరణ్ శర్మ (రూ.50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు), విఘ్నేశ్ (రూ.30 లక్షలు), సత్యనారాయణ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు), శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు), అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు), బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు).
చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
Comments
Please login to add a commentAdd a comment