photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) జరుగనున్న డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో తొలుత (మధ్యాహ్నం 3:30 గంటలకు) ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడేలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించగా.. ముంబై 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో (ఆర్సీబీ, సీఎస్‌కే) ఘోర పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడినట్లు కనిపిస్తున్న ముంబై టీమ్‌కు రిలాక్స్ అయ్యే లోపే మరో షాక్ తగిలింది. తొలి మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కేకేఆర్‌తో మ్యాచ్‌కు సైతం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు.
కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్ సంసిద్దతపై అతని సహచరుడు టిమ్ డేవిడ్ ఓ క్లూ వదిలాడు. ఆర్చర్ ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు టిమ్ తెలిపాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ఆర్చర్ అందుబాటులో ఉండేది లేనిది చివరి నిమిషం వరకు చెప్పలేమని పేర్కొన్నాడు. శనివారం ఆర్చర్ కొద్దిసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడని, అనంతరం నెట్స్‌లో భారీ షాట్లు సైతం ఆడాడని, అయినా ఇదంతా అతను మెడికల్ టీమ్ పర్యవేక్షనలో చేస్తుండటం కొంత ఆందోళనకరమేనని చెప్పుకొచ్చాడు.
మరోవైపు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కేకేఆర్‌ను ఢీకొనడం పెద్ద ఛాలెంజ్‌తో కూడుకున్న పని అని, ఇలాంటి ప్రత్యర్ధిపై బలమైన బౌలింగ్ ఆప్షన్స్ లేకపోత చాలా కష్టమవుతుందని తెలిపాడు. గత 3 మ్యాచ్‌ల్లో 200 ప్లస్ స్కోర్ చేసిన కేకేఆర్‌ను నిలువరించాలంటే తమ బౌలింగ్ పటిష్టంగా ఉండాలని, మ్యాచ్ సమయానికి ఆర్చర్ అందుబాటులోకి వస్తే, తమ విజయావకాశాలు మెరుగవుతాయని అన్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణాలను నిలువరించడం తమకు కత్తి మీద సామే అవుతుందని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment