ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. భార్యపై గృహ హింసకు పాల్పడడం, మహిళల్ని వెంబడించడం, దొంగతనానికి పాల్పడడం వంటి కేసుల్లో భాగంగా స్లేటర్‌ను క్వీన్స్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏకంగా 19 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ మధ్యలో అతను ఈ నేరాలకు పాల్పడినట్లు కేసులు రిజిష్టర్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైఖేల్ స్లేటర్‌కు క్వీన్స్‌లాండ్ మేజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. అతడి బెయిల్ ధరఖాస్తును కోర్టు తిరస్కరించింది. అతడికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 31కు కోర్టు వాయిదా వేసింది. ఈ విషయం తెలిసిన స్లేటర్ కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బంది అతడిని తన సెల్‌కు తీసుకు వెళ్తుండగా స్లేటర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. అదేవిధంగా స్లేటర్ ప్రస్తుతం మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గతంలో పలుమార్లు కోర్టు ఆదేశాలను స్లేటర్ ధిక్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఆస్ట్రేలియా తరపున 74 టెస్టులు, 42 వన్డేలు ఆడిన స్లేటర్ 42.83 సగటుతో 5,312 పరుగులు సాధించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్లేటర్ ఆ తర్వాత టీవీ కామెంటేటర్‌గా రాణించాడు. ఛానెల్ 9, ఛానల్ 7లలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment