‘ఫేస్ ఆఫ్’లో ప్రత్యర్థి చెంప చెళ్లుమనిపించిన దిగ్గజ బాక్సర్
టెక్సాస్: ఆరు పదుల వయసు సమీపిస్తున్నా... తనలో దుందుడుకుతనం తగ్గలేదని బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ చాటుకున్నాడు. కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జాక్ పాల్‌తో బౌట్‌లో తలపడనున్నాడు. ప్రధాన పోటీకి ముందు జరిగిన ఆటగాళ్ల ప్రత్యేక కార్యక్రమంలోనే రెచ్చిపోయిన టైసన్... జాక్ పాల్ చెంప చెళ్లుమనిపించాడు. సుదీర్ఘ కెరీర్‌లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్‌లను నాకౌట్ చేశాడు.
అసలు పోరుకు ముందు నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్’ కార్యక్రమం సమయంలో నిర్వాహకులు అడుగుతున్న ప్రశ్నలకు విసుగెత్తిన టైసన్... ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ని చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పటికే ఈ బౌట్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోగా... టైసన్ ప్రవర్తనతో అది మరింత ఎక్కువైంది. శనివారం జరగనున్న ఈ బౌట్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ప్రసారం చేయనున్నారు.
ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా 60 వేల మంది అభిమానులు... ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది వీక్షించనున్నారు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టైసన్... ఆ తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. షెడ్యూల్ ప్రకారం టైసన్, జాక్ పాల్ మధ్య బౌట్ ఈ ఏడాది జూలైలోనే జరగాల్సి ఉన్నా... ఆ సమయంలో టైసన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో దాన్ని వాయిదా వేశారు.
దూకుడు మీదున్న టైసన్‌కు... ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పది బౌట్లు నెగ్గిన 27 ఏళ్ల జాక్ పాల్ ఏమాత్రం పోటీనిస్తాడో చూడాలి. ‘చివరి బౌట్‌లో కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిన తర్వాత జీవితంలో చాలా చూశాను. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాను. అన్నిటికి మించి బాక్సింగ్‌నే ఇష్టపడతా. ఒకప్పటి టైసన్ ఇప్పుడు లేడు. నా జీవితంలో ఎక్కువ ఏమీ మిగిలి లేదు. అందుకే మంచి అనుభూతులు సొంతం చేసుకోవాలనుకుంటున్నా’ అని ఫైట్‌కు ముందు టైసన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment