మహిళల 49 కేజీల విభాగంలో త్రుటిలో చేజారిన పతకం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం త్రుటిలో చేజారింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో భారత స్టార్ మీరాబాయి చాను నాలుగో స్థానంలో నిలిచింది. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో మీరాబాయి మొత్తం 199 కేజీల బరువెత్తి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్ అండ్ జెర్క్ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
హు జిహుయ్ (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు) మొత్తం 206 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మిహేలా వలెంటీనా (రొమేనియా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కేజీలు) మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. సురోద్‌చనా ఖాంబావ్ (థాయ్‌లాండ్; స్నాచ్‌లో 88 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్‌లో 112 కేజీలు) 200 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. పారిస్‌లోనూ మీరాబాయి పతకం సాధించి ఉంటే ఒలింపిక్స్ వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందేది.
అవినాశ్‌కు 11వ స్థానం
మరోవైపు బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఫైనల్లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లే 8 నిమిషాల 14.18 సెకన్లలో గమ్యానికి చేరి 11వ స్థానంలో నిలిచాడు. సూఫియాన్ (మొరాకో) స్వర్ణం, రూక్స్ (అమెరికా) రజతం, కిబివోట్ (కెన్యా) కాంస్యం గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment