
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్‌ను తనే ఎంచుకుంది. టెండర్, ప్రాతిపాదికంటూ లేకుండా ఏకంగా ఒప్పందాన్ని ఖరారు కూడా చేసుకుంది. బెంగళూరుకు చెందిన ఈ–గేమింగ్ సంస్థ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) ఇప్పుడు భారత జట్లకు (పురుషులు, మహిళలు) కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2020 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఎంపీఎల్ భారత జట్లకు కిట్ స్పాన్సర్‌గా ఉండనుంది. ఒప్పందం విలువ మొత్తం రూ. 120 కోట్లు అని సమాచారం. ఒప్పందంలో భాగంగా భారత్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఎంపీఎల్ రూ. 65 లక్షలు బీసీసీఐకి చెల్లించనుంది.
► గాలక్టస్ ఫన్‌వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఎంపీఎల్‌కు నిజానికి కిట్ స్సాన్సరయ్యే ప్రాథమిక అర్హతలేవీ లేవు. అయినా కూడా మూడేళ్ల ఒప్పందాన్ని ఖరారు చేస్తూ బీసీసీఐ సోమవారం సంతకాలు చేసింది. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్లకు అంతర్జాతీయ బ్రాండింగ్ ‘నైకీ’ కిట్స్, అపెరాల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే ఈ ఏడాది ఒప్పంద గడువు ముగియడంతో ప్రముఖ సంస్థ నైకీ పునరుద్ధరించుకోలేదు. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల వేటలో పడింది. టెండర్లను ఆహ్వానిస్తూ నోటీసు కూడా ఇచ్చింది.
► ధనవంతమైన బోర్డుతో ఏదో రకంగా జతకట్టేందుకు ఉవ్విళ్లూరే కార్పొరేట్ సంస్థలు ఈ కరోనా కాలంలో మాత్రం మొహం చాటేశాయి. దీంతో చిత్రంగా ఏ ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. అయితే మరోసారి టెండర్లకు వెళ్లకుండానే ఏకపక్షంగా అదికూడా చడీచప్పుడు లేకుండా ఒక సంస్థను ఎంచుకుని మరీ స్పాన్సర్‌షిప్ కట్టబెట్టింది. ఇది బీసీసీఐ వ్యవహారశైలికి ఏమాత్రం తగని పని. జవాబుదారీతనం, పారదర్శకత కోసం సుప్రీం కోర్టు క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. కొన్నేళ్ల పాటు కోర్టు నియమిత పరిపాలక కమిటీనే బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు చూసుకుంది. తిరిగి ఎన్నికల్లయ్యాక భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత వినోద్ రాయ్ నేతృత్వంలోని కమిటీ బోర్డు పరిపాలన నుంచి తప్పుకుంది.
► కోర్టు ఆజమాయిషీలో నుంచి వచ్చి ఏడాది కాకముందే మళ్లీ బోర్డు పక్కదారి పట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన బోర్డు ఉన్నతాధికారి ఒకరు తాము ఏకపక్షంగా కిట్ స్పాన్సర్‌షిప్ ఇవ్వలేదని అందుబాటులో ఉన్న సంస్థలని సంప్రదించామని, సుమారు 20 సంస్థలతో సంప్రదింపులు జరిపినా కూడా ఎవరూ ఆసక్తి కనబరచకపోవడంతో ఎంపీఎల్ ఆసక్తిమేరకు అప్ప గించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment