
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న మొదలు కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ టోర్నీలో అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది.
ఫిబ్రవరి 23న దుబాయ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఐసీసీ ఈవెంట్‌లలో ఇప్పటివరకు పాకిస్తాన్‌పై భారత్ పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. కానీ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం టీమిండియాను పాక్ కంగుతిన్పించింది. 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి పాక్ ఛాంపియన్‌గా నిలిచింది.
దీంతో ఈసారి పాక్‌ను చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ మ్యాచ్‌లో పాక్‌కు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ నసీమ్ షా ఎక్స్‌ఫ్యాక్టర్‌గా మారనున్నారని అమీర్ జోస్యం చెప్పాడు.
భారత్-పాక్ మ్యాచ్ కోసం నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు మహ్మద్ రిజ్వాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. అతడు మరోసారి పాక్‌కు కీలకంగా మారనున్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లలో భారత్‌పై అతడికి మంచి రికార్డు ఉంది. అదేవిధంగా నసీమ్ షా కూడా పాక్‌కు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారుతాడని నేను భావిస్తున్నాను.
నసీమ్ ఇటీవల కాలంలో అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. అతడిని ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడవచ్చు. గతేడాది వరకు షాహీన్ అఫ్రిది నుంచి భారత జట్టుకు గట్టి సవాలు ఎదరయ్యేది. పాక్ జట్టులో బెస్ట్ బౌలర్ అంటే నేను కూడా అఫ్రిది పేరునే చెప్పేవాడిని.
అతడు 145 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసే వాడు. బంతిని కూడా అద్భుతంగా స్వింగ్ చేసేవాడు. కానీ మోకాలి గాయం తర్వాత అతడు తన పేస్‌ను కోల్పోయాడు. 135 కి.మీ మించి బౌలింగ్ చేయలేకపోతున్నాడు. బంతి కూడా స్వింగ్ కావడం లేదు అని టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు.
కాగా పాక్ స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది పేర్లను అమీర్ చెప్పకపోవడం గమనార్హం. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా పాక్ నిలివడంలో అమీర్‌ది కీలక పాత్ర. ఫైనల్లో అమీర్ 3 కీలక వికెట్లు పడగొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment