360 రోజుల తర్వాత యాక్టివ్ క్రికెట్‌లోని అడుగుపెట్టిన టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ వచ్చీ రాగానే రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ తొలుత బౌలింగ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో షమీ 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం షమీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. పదో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమీ 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. షమీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో బెంగాల్ తమ లీడ్‌ను భారీగా పెంచుకోగలిగింది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), కెప్టెన్ అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. షమీ 2 పరుగులకే ఔటయ్యాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే ఆలౌటైంది. షమీ (4/54), సూరజ్ సింధు జైస్వాల్ (2/35), మొహమ్మద్ కైఫ్ (2/41), రోహిత్ కుమార్ (1/27) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సుభ్రాంన్షు సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
61 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వ్రిత్తిక్ ఛటర్జీ (52), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 276 పరుగులకు ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ పాండే, సరాన్ష్ జైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ మూడో రోజు టీ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 279 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు సుభ్రాన్షు సేనాపతి (27), హిమాన్షు మంత్రి (29) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment